టీ20 ప్రపంచకప్‌కు ముందే డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా గతేడాది రన్నరప్ సౌతాఫ్రికాతో తలపడనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పోరు రెగ్యులర్ మ్యాచ్‌లా కాకుండా వార్మప్ మ్యాచ్‌గా జరుగనుంది. ప్రపంచకప్‌కు ముందు ఇదొక్కటే వార్మప్ మ్యాచ్ అని సమాచారం.
వాస్తవానికి ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలకు ముందు వార్మప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే బంగ్లాదేశ్ కిరికిరి ఉండటంతో ఫైనల్ షెడ్యూల్ ఆలస్యమైంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ప్రపంచకప్‌లో ఆడనుండటంతో షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది.
భారత్-సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలో జరగనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఫిబ్రవరి 3న ముంబైలో కలుస్తుంది. సౌతాఫ్రికాతో వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ ఫిబ్రవరి 4న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగనున్నట్లు సమాచారం.
ప్రపంచకప్ మెయిన్ షెడ్యూల్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుంది. కొలొంబో వేదికగా జరిగే పాకిస్తాన్-నెదర్లాండ్స్ మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు ముంబైలోని వాంఖడే వేదికగా యూఎస్‌ఏతో ఆడనుంది.
భారత్.. యూఎస్‌ఏ, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియాతో పాటు గ్రూప్-ఏలో ఉంది. మిగతా గ్రూప్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 12 (నమీబియాతో ఢిల్లీలో), 15 (పాకిస్తాన్‌తో కొలొంబోలో), 18 (నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్‌లో) తేదీల్లో జరుగనున్నాయి.
దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, యూఏఈలతో కలిసి గ్రూప్-డిలో ఉంది. దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 9న అహ్మదాబాద్‌లో కెనడాతో ఆడనుంది.


