
నేటి నుంచి రెండో అనధికారిక టెస్టు
ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడనున్న భారత్ ‘ఎ’
నార్తంప్టన్: ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు... ఇంగ్లండ్ లయన్స్‌తో భారత ‘ఎ’ జట్టు రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లకు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్ మంచి ప్రాక్టీస్ కానుండగా... సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై అందరి దృష్టి నిలవనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం జట్టులో అందరికంటే అనుభవజ్ఞుడైన రాహుల్‌పై బాధ్యత పెరగగా... ఈ మ్యాచ్‌లో అతడు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి.
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కొత్తగా ఎంపికైన శుబ్‌మన్ గిల్, యువ ఓపెనర్ సాయి సుదర్శన్ ఇంకా ఇంగ్లండ్‌కు చేరుకోకపోవడంతో ఆ ఇద్దరూ ఈ మ్యాచ్‌లో పాల్గొనడంలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ఈరోజు లండన్ బయలు దేరనున్న మిగిలిన ఆటగాళ్లు ప్రాక్టీస్ అనంతరం ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ ఆడనున్నారు. తొలి అనధికారిక మ్యాచ్‌లో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో కదం తొక్కగా... సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి అర్ధశతకాలు సాధించారు.
ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరగనుండగా... ప్రాక్టీస్ మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా తుది జట్టు ఎంపిక జరగనుంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆరుగురు ఆటగాళ్లు ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి అనధికారిక టెస్టులో పాల్గొనగా... పేసర్ ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ్రస్టేలియా పర్యటనలో అటు బంతితో ఇటు బ్యాట్‌తో ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈ ఏడాది ఐపీఎల్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధనాధన్ షాట్‌లతో హాఫ్‌సెంచరీ చేసిన నితీశ్... బంతితోనూ సత్తాచాటాలని భావిస్తున్నాడు. తుది జట్టులో చోటు కోసం మరో పేస్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్‌తో నితీశ్ పోటీపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌కు కూడా బ్యాటింగ్ పిచ్ అందుబాటులో ఉంది. ఇంగ్లండ్ టెస్టు జట్టులో సభ్యులైన క్రిస్ వోక్స్, జోష్ టంగ్ లయన్స్ తరఫున రాణించాలని చూస్తున్నారు.