Sakshi News home page

భారత్‌ అదరహో 

Published Wed, Dec 13 2023 4:12 AM

India beat the Netherlands in the quarter finals - Sakshi

కౌలాలంపూర్‌: ఆద్యంతం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన భారత జట్టు జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఉత్తమ్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టు 4–3 గోల్స్‌ తేడాతో నెదర్లాండ్స్‌ జట్టును ఓడించింది. భారత్‌ తరఫున ఆదిత్య అర్జున్‌ లలాగే (34వ ని.లో), అరిజిత్‌ సింగ్‌ హుందల్‌ (35వ ని.లో), సౌరభ్‌ ఆనంద్‌ కుష్వా (52వ ని.లో), ఉత్తమ్‌ సింగ్‌ (57వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు.

నెదర్లాండ్స్‌ జట్టుకు టిమో బోర్స్‌ (5వ ని.లో), వాన్‌ డెర్‌ హెజ్డెన్‌ (16వ ని.లో), ఒలివియర్‌ హోర్‌టెన్‌సియస్‌ (44వ ని.లో) ఒక్కో గోల్‌ అందించారు. మిగతా క్వార్టర్‌ ఫైనల్స్‌లో జర్మనీ 2–1తో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాపై, ఫ్రాన్స్‌ 3–2తో ఆ్రస్టేలియాపై, స్పెయిన్‌ 4–2తో పాకిస్తాన్‌పై విజయం సాధించాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ జర్మనీతో భారత్‌; స్పెయిన్‌తో ఫ్రాన్స్‌ తలపడతాయి. 

జూనియర్‌ స్థాయిలో చివరిసారి 2005లో నెదర్లాండ్స్‌పై గెలిచిన భారత జట్టుకు ఈసారీ గట్టిపోటీ ఎదురైంది. అయితే మ్యాచ్‌లో మూడుసార్లు వెనుకబడ్డ భారత్‌ ఏమాత్రం ఆందోళన చెందకుండా పోరాడింది. రెండు క్వార్టర్‌లు ముగిసేసరికి 0–2తో వెనుకబడిన భారత్‌ ఆ తర్వాత నిమిషం వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి స్కోరును సమం చేసింది. మూడో క్వార్టర్‌లో నెదర్లాండ్స్‌ మూడో గోల్‌ చేసి మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది.

మ్యాచ్‌ ముగిసేందుకు ఎనిమిది నిమిషాలు ఉన్నాయనగా భారత్‌ మళ్లీ స్కోరును సమం చేసింది. అదే జోరులో మ్యాచ్‌ ముగియడానికి మూడు నిమిషాలముందు నాలుగో గోల్‌తో తొలిసారి  ఆధిక్యంలోకి వచ్చింది. చివర్లో నెదర్లాండ్స్‌ జట్టు స్కోరును సమం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. నెదర్లాండ్స్‌ ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్‌లు సంపాదించినా... భారత జట్టు గోల్‌కీపర్‌ మోహిత్‌తోపాటు రక్షణపంక్తి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండి నెదర్లాండ్స్‌కు గోల్‌ చేసే అవకాశం ఇవ్వలేదు.

చివరి పది సెకన్లలోనూ నెదర్లాండ్స్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించినా భారత ఆటగాళ్లు దానిని నిర్వీర్యం చేసి చిరస్మరణీయ విజయం అందుకున్నారు. మ్యాచ్‌ మొత్తంలో నెదర్లాండ్స్‌కు 12 పెనాల్టీ కార్నర్‌లు రాగా వాటిలో మూడింటిని గోల్స్‌గా మలిచింది. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించగా... ఒక దానిని భారత్‌ లక్ష్యానికి చేర్చింది. 

జూనియర్‌ ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో భారత్‌ సెమీఫైనల్‌ చేరడం ఇది ఆరోసారి. గతంలో భారత జట్టు 2001, 2016లలో విజేతగా, 1997లో రన్నరప్‌గా నిలిచింది. 2005, 2021లలో సెమీఫైనల్‌తోపాటు మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది.   

Advertisement

What’s your opinion

Advertisement