
స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను (India A vs Australia A) భారత-ఏ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాన్పూర్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 5) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్‌పై (Australia) భారత్ (Team India) 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో ఆసీస్ గెలిచింది. దీనికి ముందు ఆసీస్‌తో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా భారత్ చేజిక్కించుకుంది (1-0).
భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 316 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.
44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్‌కు 152 పరుగులు జోడించి, భారత్‌కు కఠిన సవాల్ విసిరారు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు తీయగా.. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2, గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు.
ప్రభ్‌సిమ్రన్ సింగ్ విధ్వంసకర శతకం
అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రభ్‌సిమ్రన్ కేవలం 68 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ప్రభ్‌సిమ్రన్ ఔటయ్యాక భారత ఇన్నింగ్స్‌ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (62), రియాన్ పరాగ్ (62) తీర్చిదిద్దారు.
ఆఖర్లో ఉత్కంఠగా మారిన మ్యాచ్
అయితే ఆఖర్లో భారత ఆటగాళ్లు వరుస పెట్టి పెవిలియన్‌కు చేరడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఒక్కో పరుగు చేసేందుకు భారత ఆటగాళ్లు నానా కష్టాలు పడ్డారు. అయితే చివర్లో విప్రాజ్ నిగమ్ (24 నాటౌట్), అర్షదీప్ (7 నాటౌట్) సహకారంతో మ్యాచ్‌ను గెలిపించాడు. ఆసీస్ బౌలర్లు టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘా తలో 4 వికెట్లు తీసి భారత్‌ను భయపెట్టారు.
చదవండి: భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు