
భారత మూలాలున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలికాలంలో తరుచూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును (PCB) ఎండగడుతూ, భారత్‌పై ప్రేమను వ్యక్తపరుస్తున్న డానిష్.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. భారత్‌పై అతి ప్రేమను ఒలకబోస్తున్నాడని కొందరు పాకిస్తానీలు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో డానిష్ ఇలా స్పందించాడు.
ఇటీవలికాలంలో కొందరు పాకిస్తానీలు నన్ను ప్రశ్నిస్తున్నారు. భారత మూలాలున్నా, క్రికెటర్‌గా ఎదిగేందుకు పాకిస్తాన్ ఇన్ని అవకాశాలు ఇస్తే.. భారత్‌కు సానుకూలంగా ఎందుకు మాట్లాడతావని నిలదీస్తున్నారు. భారత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నాని కామెంట్లు చేస్తున్నారు.
నాపై సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న ఈ మాటల దాడిపై స్పందించాల్సిన సమయం వచ్చింది. ముందుగా పాకిస్తాన్ ప్రజలకు నేను కృతజ్ఞుడిని. వారి నుంచి నాకు ఎంతో ప్రేమ లభించింది. అయితే కొందరు మాత్రం నా పట్ల చాలా వ్యతిరేక భావంతో వ్యవహరించారు.
ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పీసీబీలోని కొందరు అధికారుల నుంచి నేను తీవ్ర వివక్షను ఎదుర్కొన్నాను. ఓ దశలో బలవంతంగా మతం మార్చించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కొందరు నేను భారత పౌరసత్వం ఆశిస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి నాకు అలాంటి ఉద్దేశం లేదు. భవిష్యత్తులో అలాంటి అవసరం ఉన్నా, CAA లాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి.
పౌరసత్వం కోసం నేను భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నానడం చాలా తప్పు. భారత్ నా పూర్వీకుల భూమి. అది నాకు దేవాలయం లాంటిది. పాకిస్తాన్ నా జన్మభూమే. కానీ భారత్ నా మాతృభూమి అంటూ తన ‘X’ ఖాతాలో రాసుకొచ్చాడు.
కాగా, డానిష్ కనేరియా పాకిస్తాన్‌లో పుట్టి పెరిగనప్పటికీ.. అతని పూర్వీకుల మూలాలు భారత్‌లోని గుజరాత్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తుంది. 1980 డిసెంబర్ 16న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించిన డానిష్.. 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు తీసి పాక్ తరఫున గొప్ప స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
అయితే స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కోవడంతో అతని కెరీర్ అర్దంతరంగా ముగిసింది. దీని కారణంగా అతను జీవితకాల నిషేధం ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం అతను కుటుంబంతో పాటు అమెరికాలో ఉంటున్నాడు.
చదవండి: వన్డే కెప్టెన్‌గా ఎంపిక.. శుబ్‌మన్ గిల్ ‘బోల్డ్’ రియాక్షన్