వన్డే కెప్టెన్‌గా ఎంపిక.. శుబ్‌మన్‌ గిల్‌ రియాక్షన్‌ వైరల్‌ | Gill WC Ambition In Bold Reaction To Replacing Rohit As ODI Captain | Sakshi
Sakshi News home page

వన్డే కెప్టెన్‌గా ఎంపిక.. శుబ్‌మన్‌ గిల్‌ ‘బోల్డ్‌’ రియాక్షన్‌

Oct 5 2025 12:48 PM | Updated on Oct 5 2025 1:59 PM

Gill WC Ambition In Bold Reaction To Replacing Rohit As ODI Captain

టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) హర్షం వ్యక్తం చేశాడు. వన్డేల్లోనూ జట్టుకు సారథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్‌ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా గిల్‌ పేర్కొన్నాడు.

కాగా ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) వన్డే, టీ20 జట్లను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన బోర్డు.. అతడి స్థానంలో గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వన్డే వరల్డ్‌కప్‌-2027 (ICC ODI World Cup 2027) టోర్నీని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వెల్లడించాడు.

ప్రపంచకప్‌ గెలవడమే లక్ష్యం
ఈ నేపథ్యంలో తాను వన్డే కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల టెస్టు సారథి శుబ్‌మన్‌ గిల్‌ స్పందించాడు. ‘‘వన్డే క్రికెట్‌లో జాతీయ జట్టును ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. చాంపియన్‌ జట్టుకు సారథిగా ఎంపిక కావడం గర్వంగా ఉంది. నేను కూడా జట్టును గొప్పగా ముందుకు నడిపించాలనే ఆశిస్తున్నా.

వరల్డ్‌కప్‌ కంటే ముందు మేము 20 వరకు వన్డేలు ఆడబోతున్నాము. ప్రపంచకప్‌ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ప్రతి ఒక్క ఆటగాడు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడు. నేను కూడా అంతే. సౌతాఫ్రికాలో జరిగే ఐసీసీ టోర్నీకి మేము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాము. వరల్డ్‌కప్‌ గెలుస్తాం’’ అని శుబ్‌మన్‌ గిల్‌ పేర్కొన్నాడు.

రోహిత్‌ ఖాతాలో రెండు
కాగా చివరగా 2011లో మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియా.. 2023లో సొంతగడ్డపై రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఈ ఏడాది ఐసీసీ వన్డే చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో మాత్రం విజేతగా నిలిచింది. 

తద్వారా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఖాతాలో రెండు ఐసీసీ టైటిళ్లు చేరాయి. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలోనూ కెప్టెన్‌ హోదాలో రోహిత్‌ భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే.

అనూహ్య రీతిలో
ఆ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేసిన రోహిత్‌ శర్మ పది కిలోల బరువు తగ్గి ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరచుకున్నాడు. 

వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడటమే లక్ష్యంగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో అనూహ్య రీతిలో కెప్టెన్సీ కోల్పోయాడు. కాగా 2027లో సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా ఉమ్మడిగా వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. 

చదవండి: 50 ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ.. ఆసీస్‌ బ్యాటర్‌ విధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement