నేడు భారత్, న్యూజిలాండ్ చివరి వన్డే
విజయంపై టీమిండియా ధీమా
ఆత్మవిశ్వాసంతో కివీస్
మ.గం.1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
దాదాపు ఏడాదిన్నర క్రితం భారత గడ్డపై న్యూజిలాండ్ తొలి సారి టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. అంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ అలాంటి ఘనత సాధించని కివీస్ అనూహ్యంగా భారత్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు వన్డేల్లో చరిత్ర చూస్తే భారత్‌లో న్యూజిలాండ్ ఎప్పుడూ వన్డే సిరీస్ నెగ్గలేదు. కానీ గత మ్యాచ్‌లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే అలాంటి అవకాశం ఇక్కడా కనిపిస్తోంది.
గతంలో మూడు సార్లు ఆ జట్టు సిరీస్ గెలిచేందుకు చేరువగా వచ్చినా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సవాల్ మధ్య స్వదేశంలో తమ రికార్డును నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 2019 మార్చి తర్వాత సొంతగడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోని రికార్డును భారత్ కొనసాగిస్తుందా లేక సంచలనం నమోదవుతుందా చూడాలి.
ఇండోర్: భారత్, న్యూజిలాండ్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. హోల్కర్ స్టేడియంలో నేడు జరిగే మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేలో భారత్ ఆధిపత్యం సాగగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ అలవోక విజయాన్ని అందుకుంది. ప్రత్యరి్థతో పోలిస్తే సొంతగడ్డపై భారత్ అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా...పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో ఇక్కడ అడుగు పెట్టిన కివీస్ కూడా తమ ఆటతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆఖరి ఆట ఆసక్తికరంగా సాగవచ్చు.
అర్ష్ దీప్‌కు చాన్స్!
భారత బ్యాటింగ్ టాప్–5 విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. రోహిత్, గిల్ జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందిస్తున్నారు. అయితే రోహిత్ తన జోరును భారీ స్కోరుగా మార్చాల్సి ఉంది. గత మ్యాచ్‌లో తక్కువ పరుగులే చేసినా...కోహ్లి ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా తన స్థాయిలో రాణిస్తుండగా... రాహుల్ రాజ్‌కోట్‌లో సెంచరీతో తానేమిటో చూపించాడు. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం.
ఆరో స్థానంలో నితీశ్ రెడ్డిని కొనసాగిస్తారా లేక స్పిన్నర్ ఆయుశ్ బదోనికి అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా చూడాలి. నితీశ్‌ను పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా జట్టు ఉపయోగించుకోవడం లేదు. స్పిన్నర్‌గా కుల్దీప్ ప్రదర్శన కీలకం కానుంది. జడేజా బౌలింగ్ ప్రదర్శనను చూస్తూ అతని బ్యాటింగ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. సుదీర్ఘ
కాలంగా అతను వన్డేల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఓవరాల్‌గా భారత్‌లోనైతే 2013 తర్వాత అతను కనీసం హాఫ్ సెంచరీ సాధించలేదు. పేసర్లుగా సిరాజ్, హర్షిత్ ఖాయం. మూడో పేసర్‌గా వైవిధ్యం కోసం ప్రసిధ్ స్థానంలో అర్ష్ దీప్‌ను ప్రయతి్నంచవచ్చు. తొలి రెండు వన్డేల్లో ప్రసిధ్ పెద్దగా ఆకట్టుకోలేదు.
కుర్రాళ్లు సమష్టిగా...
‘న్యూజిలాండ్ ఇంత సులువుగా విజయం సాధించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది’...అంటూ రెండో వన్డే తర్వాత దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్య భారత్ వైఫల్యాన్ని స్పష్టంగా చూపించింది. మిచెల్, యంగ్‌లను నిలువరించడంలో మన బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కాన్వే, నికోల్స్ కూడా ఓపెనర్లుగా రాణిస్తే కివీస్ కూడా మంచి స్కోరుపై దృష్టి పెట్టవచ్చు. ఫిలిప్స్‌లాంటి హిట్టర్‌తో పాటు మంచి బ్యాటింగ్ పదును ఉన్న కెప్టెన్ బ్రేస్‌వెల్ మిడిలార్డర్‌లో కీలకం కానున్నారు. పేసర్ జేమీసన్ మొదటినుంచీ భారత్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. క్లార్క్, ఫోక్స్‌లతో జట్టు బౌలింగ్ ఆధారపడి ఉంది. ఆఫ్ స్పిన్నర్‌గా బ్రేస్‌వెల్ ఉన్నాడు కాబట్టి తొలి వన్డే తరహాలోనే లెనాక్స్ స్థానంలో లెగ్‌స్పిన్నర్ ఆదిత్య అశోక్‌కు చోటు దక్కవచ్చు. ఎనిమిది మంది తొలిసారి భారత గడ్డపై ఆడుతున్న ఆటగాళ్లతో పర్యటనకు వచ్చి వన్డే సిరీస్ గెలవగలిగితే న్యూజిలాండ్‌కు ఇది పెద్ద ఘనత అవుతుంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, అయ్యర్, రాహుల్, నితీశ్/బదోని, జడేజా, హర్షిత్, కుల్దీప్, అర్ష్ దీప్, సిరాజ్.
న్యూజిలాండ్: బ్రేస్‌వెల్ (కెప్టెన్), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జేమీసన్, ఫోక్స్, ఆదిత్య.


