IND Vs WI 3rd T20: దంచి కొట్టిండు.. దండం పెట్టిండు.. వైర‌ల‌వుతున్న సూర్య‌కుమార్ న‌మ‌స్తే సెల‌బ్రేష‌న్స్‌

IND Vs WI 3rd T20: Suryakumar Yadav Special Namaste Celebration After Completing Half Century - Sakshi

వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యంతో విండీస్‌పై హ్యాట్రిక్ విజ‌యాలు న‌మోదు టీమిండియా వ‌రుస‌గా మ‌రో సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. అంత‌కుముందు రోహిత్ సేన‌ 3 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్ర‌మంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డును సాధించాడు. వరుసగా మూడో సిరీస్‌ను వైట్‌ వాష్‌ చేసిన కెప్టెన్‌గా అరుదైన గుర్తుంపు ద‌క్కించుకున్నాడు. 

ఇదిలా ఉంటే, ఆఖ‌రి టీ20లో సూర్య‌కుమార్ యాద‌వ్ (31 బంతుల్లో 65; ఫోర్, 7 సిక్సర్లు) సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విచ‌క్ష‌ణారాహిత్యంగా సిక్స‌ర్లతో విరుచుకుప‌డిన సూర్య‌కుమార్‌.. వెంక‌టేశ్ అయ్య‌ర్ (19 బంతుల్లో 35 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో క‌లిసి ఆఖరి 5 ఓవ‌ర్ల‌లో ఆకాశమే హ‌ద్దుగా చెల‌రేగ‌డంతో టీమిండియా నిర్ణీత ఓవ‌ర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 184 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

ఈ క్ర‌మంలో సిక్స‌ర్‌తో టీ20ల్లో నాలుగో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య‌కుమార్‌.. ఆ ఫీట్ సాధించాక చేసుకున్న సంబురాల‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అర్థ సెంచ‌రీ పూర్తికాగానే సూర్యకుమార్ బ్యాట్ పైకెత్తి సహచరులకు అభివాదం చేశాక‌, రెండు చేతులు జోడించి దండం పెట్టాడు. వెరైటీగా ఉన్న ఈ నమస్తే సెలబ్రేషన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అలాగే సూర్య‌ప్ర‌తాపాం చూపించి విండీస్ బౌల‌ర్ల‌కు ద‌డ పుట్టించినందుకు గాను అభినందిస్తున్నారు.

కాగా, టీమిండియా నిర్ధేశించిన 185 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన విండీస్ నిర్ణీత‌ ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డంతో 17 ప‌రుగుల‌ తేడాతో ఓట‌మిపాలై 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో చేజార్చుకుంది. నికోల‌స్ పూర‌న్ (47 బంతుల్లో 61; 8 ఫోర్లు, సిక్సర్) వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికీ విండీస్‌కు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాడు. ఆఖ‌ర్లో రొమారియో షెప‌ర్డ్ (21 బంతుల్లో 29; ఫోర్, 3 సిక్సర్లు) భారీ సిక్స‌ర్ల‌తో భ‌య‌పెట్టిన‌ప్ప‌టికీ విండీస్‌కు బోణీ విజ‌యం ద‌క్క‌లేదు. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ 3, దీప‌క్ చాహ‌ర్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్, శార్ధూల్ ఠాకూర్‌ త‌లో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 
చ‌ద‌వండి: సూర్య‌కుమార్ విధ్వంసం.. మూడో టీ20లోనూ టీమిండియాదే విజ‌యం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top