సౌతాఫ్రికా వెన్ను విరిచిన బుమ్రా.. టెస్టుల్లో 4 అరుదైన రికార్డులు | Sakshi
Sakshi News home page

Ind vs SA: సౌతాఫ్రికా వెన్ను విరిచిన బుమ్రా.. అరుదైన రికార్డులు! అక్కడ ఏకైక భారత బౌలర్‌గా

Published Thu, Jan 4 2024 4:31 PM

Ind vs SA 2nd Test Day 2: Bumrah Breaks Proteas Back Bags Rare Records - Sakshi

Ind vs SA 2nd Test Day 2: Jasprit Bumrah Records: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు వికెట్లకే పరిమితమైన ఈ స్పీడ్‌స్టర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. 

న్యూలాండ్స్‌ పిచ్‌ మీద 63/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఆతిథ్య ప్రొటిస్‌ జట్టుకు బుమ్రా ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. ముందు రోజు ట్రిస్టన్‌ స్టబ్స్‌ రూపంలో వికెట్‌ దక్కించుకున్న బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తొలి ఓవర్లో(17.6వ ఓవర్‌)నే డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ను అవుట్‌ చేసి శుభారంభం అందించాడు.

ఆ తర్వాత మరో నాలుగు ఓవర్ల అనంతరం కైలీ వెరెనెను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం మార్కో జాన్సెన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేసిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. కేశవ్‌ మహరాజ్‌ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుని ఐదు వికెట్ల హాల్‌ అందుకున్నాడు. ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్‌ చేసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగించిన బుమ్రా ఖాతాలో ఆరో వికెట్‌ జమైంది.

ఈ నేపథ్యంలో.. సౌతాఫ్రికాతో  రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా జస్‌ప్రీత్‌ బుమ్రా నాలుగు అరుదైన రికార్డులు సాధించాడు. అవేంటంటే..

1. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌
2. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌.
3. సౌతాఫ్రికాలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో భారత బౌలర్‌.
4. న్యూలాండ్స్‌ పిచ్‌ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్‌(ఏకైక భారత బౌలర్‌).

బుమ్రా కంటే ముందు ఈ ఘనతలు సాధించిన బౌలర్లు
1. సౌతాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు
45 - అనిల్ కుంబ్లే
43 - జవగళ్ శ్రీనాథ్
38* - జస్ప్రీత్ బుమ్రా
35 - మహ్మద్ షమీ
30 - జహీర్ ఖాన్.

2. SENA దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్లు
7 - కపిల్ దేవ్
6 - భగవత్ చంద్రశేఖర్
6 - జహీర్ ఖాన్
6 - జస్ప్రీత్ బుమ్రా.

3. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్‌ వికెట్‌ హాల్స్‌ తీసిన భారత బౌలర్లు
3 - జవగళ్ శ్రీనాథ్
3 - జస్ప్రీత్ బుమ్రా
2 - వెంకటేష్ ప్రసాద్
2 - ఎస్ శ్రీశాంత్
2 - మహ్మద్ షమీ.

4. న్యూలాండ్స్‌ పిచ్‌(కేప్‌టౌన్‌) మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు
25 - కొలిన్ బ్లైత్ (ఇంగ్లండ్)
18 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)(న్యూలాండ్స్‌ పిచ్‌ మీద ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌)
17 - షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)
16 - జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్)
15 - జానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్)

బుమ్రా ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్‌ అయింది. బుమ్రాకు ఆరు వికెట్లు దక్కగా.. ముకేశ్‌ కుమార్‌ రెండు, ప్రసిద్‌ కృష్ణ, సిరాజ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

Advertisement
 
Advertisement