
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌లో ఆడే భారత జట్టులో.. టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) చోటు దక్కించుకుంటాడా? లేదా?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. గతేడాది జూలైలో గిల్ టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడు వన్డే, టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు.
మరోవైపు.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)కు కూడా టెస్టుల్లోనే పెద్దపీట వేసింది మేనేజ్‌మెంట్. ఈ క్రమంలో అతడు కూడా గిల్ మాదిరి గతేడాదే చివరగా టీ20లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
అదరగొట్టిన అభిషేక్- సంజూ
ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి స్థానంలో అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ (Sanju Samson) ఓపెనింగ్ జోడీగా వచ్చి అదరగొట్టారు. గత కొన్నాళ్లుగా ఓపెనర్లుగా జట్టులో పాతుకుపోయారు. అయితే, ఈసారి టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఆసియా కప్ టోర్నీని పొట్టి ఫార్మాట్లో నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో ఈ ఖండాంతర టోర్నీకి భారత జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. గిల్, జైసూలను తిరిగి టీ20 జట్టులోకి పిలిపించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు మేనేజ్‌మెంట్‌కు సూచిస్తుండగా.. మరికొందరు మాత్రం అభిషేక్- సంజూ జోడీకి ఓటు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. శుబ్‌మన్ గిల్‌ను ఆసియా టీ20 కప్ టోర్నీలో ఆడించేందుకు సెలక్షన్ కమిటీ విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీకి ఎంపిక చేసే జట్టులో గిల్‌కు చోటివ్వద్దని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.
గిల్‌కు అగార్కర్ నో!.. అతడికి లైన్ క్లియర్!
ఓపెనింగ్ జోడీగా అభిషేక్- సంజూ రిథమ్‌లో ఉన్నారు కాబట్టి వారినే కొనసాగించాలని అగార్కర్ భావిస్తున్నాడట. గిల్‌ను జట్టులోకి తీసుకుంటే తుదిజట్టు కూర్పు క్లిష్టతరంగా మారుతుందని.. అయితే, యశస్వి జైస్వాల్‌ను మాత్రం బ్యాకప్ ఓపెనర్‌గా తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గౌతీ రంగంలోకి దిగితే మాత్రం
అయితే, ఒకవేళ హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. గిల్‌ను జట్టులో చేర్చాలని పట్టుబడితే మాత్రం.. అగార్కర్ అందుకు అంగీకరించే అవకాశం ఉంది. మరోవైపు.. దేశీ టోర్నీలు, ఐపీఎల్-2025లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్‌కు కూడా అగార్కర్ మొండిచేయి చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లను ఈ టోర్నీకి తప్పక ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మిడిలార్డర్‌లో శివం దూబే, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ స్థానం కోసం పోటీపడుతున్నారు.
సిరాజ్, షమీలకు మొండిచేయి
ఇక పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా ఆసియా కప్ టోర్నీకి ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు ఈ జట్టులో చోటు దక్కడం సాధ్యం కాకపోవచ్చు.
బుమ్రా పేస్ దళంలో యువ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ తప్పక స్థానం దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసియా కప్-2025 టోర్నీకి బీసీసీఐ.. మంగళవారం (ఆగష్టు 19) తమ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే ఈ అంశంపై స్పష్టత వస్తుంది.
చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్