
ద హండ్రెడ్ లీగ్-2025లో మాంచెస్టర్ ఒరిజినల్స్ రెండో విజయం నమోదు చేసింది. నిన్న (ఆగస్ట్ 17) నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ ఆటగాళ్లు జోస్ బట్లర్, హెన్రిచ్ క్లాసెన్, రచిన్ రవీంద్ర ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు.
బట్లర్ (45 బంతుల్లో 64 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), క్లాసెన్ (25 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు సాధించగా.. రచిన్ రవీంద్ర (14 బంతుల్లో 31; 6 ఫోర్లు) బౌండరీల వర్షం కురిపించాడు.
వీరి ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో మరో విధ్వంసకర ఆటగాడు ఫిల్ సాల్ట్ (9) నిరుత్సాహరచగా.. మెక్‌కిన్నీ 11 పరుగులు చేశాడు. సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ 2, మిచెల్ సాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.
బేకర్ హ్యాట్రిక్
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ ఛార్జర్స్.. మాంచెస్టర్ బౌలర్ల ధాటికి 87 బంతుల్లో 114 పరుగులకే కుప్పకూలింది. సోన్నీ బేకర్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి మాంచెస్టర్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. బేకర్ వరుస (రెండు ఓవర్లలో) బంతుల్లో డేవిడ్ మలాన్, టామ్ లాస్, జేకబ్ డఫీలను ఔట్ చేశాడు.
మరో పేసర్ జోష్ టంగ్ కూడా 3 వికెట్లతో రాణించాడు. రచిన్ రవీంద్ర, నూర్ అహ్మద్ తలో 2 వికెట్లు తీసి సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. సూపర్ ఛార్జర్స్ తరఫున డేవిడ్ మిల్లర్ (38) టాప్ స్కోరర్‌గా కాగా.. జాక్ క్రాలే (16), డేవిడ్ మలాన్ (19), హ్యారీ బ్రూక్ (11), మిచెల్ సాంట్నర్ (12) రెండంకెల స్కోర్లు చేశారు.