
సౌతాఫ్రికా యువ సంచలనం క్వెనా మఫాకా (Kwena Maphaka) వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆస్ట్రేలియాతో యాభై ఓవర్ల ఫార్మాట్ సిరీస్ ఆడే ప్రొటిస్ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. కాగా సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
టీ20 సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఓటమి
ఆసీస్‌తో మూడు టీ20, మూడు వన్డేల (AUS vs SA) సిరీస్ ఆడేందుకు ప్రొటిస్ జట్టు అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో తొలుత పొట్టి ఫార్మాట్ సిరీస్ జరుగగా.. ఆతిథ్య ఆసీస్.. సౌతాఫ్రికాను 2-1తో ఓడించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మంగళవారం (ఆగష్టు 19) నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.
అదరగొట్టిన మఫాకా, బ్రెవిస్
ఈ నేపథ్యంలో తమ జట్టులోకి క్వెనా మఫాకాను చేర్చినట్లు సౌతాఫ్రికా సోమవారం ప్రకటించింది. కాగా 19 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ అయిన మఫాకా.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటి వరకు రెండు టెస్టులు, రెండు వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో మూడు, వన్డేల్లో ఐదు, టీ20లలో 15 వికెట్లు పడగొట్టాడు.
ఇటీవల ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో క్వెనా మఫాకా అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి తొమ్మిది వికెట్లు తీసి.. టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సెలక్టర్లు అతడిని వన్డే జట్టులోకి తిరిగి పిలిపించారు. కాగా క్వెనా మఫాకా గతేడాది పాకిస్తాన్‌తో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.

మరోవైపు.. బ్యాటింగ్ యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కంగారూలతో టీ20 సిరీస్‌లో 22 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 200కు పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 180 పరుగులు రాబట్టాడు.
బవుమా రీఎంట్రీ.. యంగ్ గన్స్
ఈ నేపథ్యంలో క్వెనా మఫాకా, డెవాల్డ్ బ్రెవిస్ గురించి కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘యువకులు జట్టులో ఉండటం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ముఖ్యంగా బ్రెవిస్.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
జట్టు కష్టాల్లో ఉన్న వేళ నేనున్నానంటూ ముందుకు వస్తున్నాడు. వన్డేల్లోనూ అతడు రాణించగలడు’’ అని కొనియాడాడు. కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికాను విజేతగా నిలిపిన తర్వాత బవుమా.. గాయం నుంచి కోలుకునే క్రమంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇస్తున్నాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రీ బర్గర్, టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్, క్వెనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లువాన్-డ్రే ప్రిటోరియస్, కగిసో రబడ, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రనెలన్ సబ్రాయన్.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, ఆడమ్ జంపా.
చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్