
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (AUS vs SA ODIs)లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఆతిథ్య జట్టును ఏకంగా 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా యాభై ఓవర్ల ఫార్మాట్లో పరుగుల పరంగా ఆసీస్‌పై తమ అతిపెద్ద విజయం సాధించింది.
మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 మ్యాచ్‌లు జరుగగా.. 2-1తో ప్రొటిస్‌ను ఓడించి ఆసీస్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మంగళవారం (ఆగష్టు 19) వన్డే సిరీస్ ఆరంభమైంది.
మార్క్రమ్ మెరుపులు
కైర్న్స్ వేదికగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రొటిస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) మెరుపు అర్ధ శతకం (81 బంతుల్లో 82)తో అదరగొట్టగా.. రియాన్ రికెల్టన్ (43 బంతుల్లో 33) కూడా ఫర్వాలేదనిపించాడు.
బవుమా, బ్రీట్జ్కే హాఫ్ సెంచరీలు
ఇక ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma).. వచ్చీ రాగానే బ్యాట్ ఝులిపించాడు. 74 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఐదు ఫోర్ల సాయంతో 65 పరుగులు సాధించాడు. మరోవైపు.. మాథ్యూ బ్రీట్జ్కే సైతం అర్ధ శతకం (56 బంతుల్లో 57)తో ఆకట్టుకున్నాడు.
మిగిలిన వారిలో వియాన్ ముల్దర్ (26 బంతుల్లో 31, నాటౌట్) వేగంగా ఆడగా.. కేశవ్ మహరాజ్ 13 పరుగులు చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ (0)తో పాటు.. అరంగేట్ర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ (6) నిరాశపరిచారు.
అయితే, మార్క్రమ్, బవుమా, బ్రీట్జ్కే అద్భుత ప్రదర్శన కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలపై ప్రొటిస్‌కు వన్డేల్లో ఇదే రెండో అతిపెద్ద స్కోరు.
కాగా ఆసీస్ బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ ట్రవిస్ హెడ్ నాలుగు వికెట్లతో ఆశ్చర్యరపరచగా.. డ్వార్షుయిస్ రెండు, ఆడం జంపా ఒక వికెట్ పడగొట్టారు.
నిప్పులు చెరిగిన కేశవ్ మహరాజ్
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఐదు వికెట్లతో సత్తా చాటి.. ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
మార్నస్ లబుషేన్ (1), కామెరాన్ గ్రీన్ (3), జోష్ ఇంగ్లిస్ (5), అలెక్స్ క్యారీ (0) రూపంలో నలుగురు కీలక బ్యాటర్లను అవుట్ చేసిన మహరాజ్.. ఆరోన్ హార్డీ (4) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
Keshav Maharaj with a beauty to nail Cam Green! #AUSvSA pic.twitter.com/23841JVVEN
— cricket.com.au (@cricketcomau) August 19, 2025
మిగిలిన వారిలో నండ్రీ బర్గర్, లుంగీ ఎంగిడీ చెరో రెండు వికెట్లు తీయగా.. ప్రినేలన్ సబ్రాయెన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్లు ట్రవిస్ హెడ్ 27 పరుగులు సాధించగా.. కెప్టెన్ మిచెల్ మార్ష్ ఒక్కడే అర్ధ శతకం (88) సాధించాడు.
మిగిలిన వారిలో బెన్ డ్వార్షుయిస్ (33) మాత్రమే ఓ మోస్తరుగా రాణించాడు. ఫలితంగా 98 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది.
అతి పెద్ద విజయం
కాగా 1994లో పెర్త్ వన్డేలో సౌతాఫ్రికా ఆసీస్‌ను 82 పరుగుల తేడాతో ఓడించింది. ఇలా ఇప్పుడు 98 పరుగుల తేడాతో చిత్తు చేసి అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. పది ఓవర్లలో కేవలం 33 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీసిన కేశవ్ మహరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్