
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వల్లే తమకు వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడం సాధ్యమైందని పేర్కొన్నాడు. భారత వన్డే జట్టు కెప్టెన్‌గా ఉద్వాసనకు గురైన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి మంగళవారం మీడియా ముందుకు వచ్చాడు.
ముంబైలో జరిగిన CEAT క్రికెట్ రేటింగ్ అవార్డు ప్రదానోత్సం కార్యక్రమంలో రోహిత్ పాల్గొన్నాడు. ఈ ఏడాది సారథిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకుగానూ ప్రత్యేక పురస్కారం అందుకున్నాడు.
ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ జట్టంటే నాకెంతో ఇష్టం. వారితో కలిసి ఆడటం, వారితో కలిసి ప్రయాణించడం గొప్ప విషయం. ఇదేదో ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదు. చాలా ఏళ్లుగా శ్రమిస్తున్న మాకు దక్కిన ప్రతిఫలం.
చాలాసార్లు ఫైనల్ వరకు వచ్చి.. ట్రోఫీని చేజార్చుకున్నాం. అయితే, ఈసారి మాత్రం తప్పులు పునరావృతం కానివ్వద్దని నిర్ణయించుకున్నాం. ఒకరో.. ఇద్దరో ఆటగాళ్ల వల్ల ఇది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు గొప్పగా రాణిస్తేనే అనుకున్న ఫలితాన్ని రాబట్టగలం.
నాకు, రాహుల్ భాయ్‌కు..
చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుపులో భాగమైన ఆటగాళ్లంతా.. టైటిల్‌కు అర్హులు. మేమంతా ఎన్నో ఏళ్లుగా దీనికోసం శ్రమిస్తున్నాం. కేవలం ఆట మీదే దృష్టి పెట్టాము. జట్టు నుంచి నాకు, రాహుల్ భాయ్‌కు అందిన సహకారం గొప్పది.
టీ20 ప్రపంచకప్-2024లో మేము సిద్ధం చేసుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం. వాటినే చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ కొనసాగించాము. అయితే, 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో మాత్రం ఓడిపోయాము. ఆ తర్వాత మాలో పట్టుదల మరింత పెరిగింది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
గంభీర్‌కు రోహిత్ కౌంటర్
కాగా ద్రవిడ్ మార్గదర్శనంలో.. రోహిత్ కెప్టెన్సీలో 2024లో పొట్టి ప్రపంచకప్ గెలిచింది టీమిండియా. ఆ తర్వాత ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేయగా.. గౌతం గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ మార్గదర్శనం చేసినా.. దాని వెనుక ద్రవిడ్ ఏళ్ల శ్రమ ఉందని రోహిత్ పరోక్షంగా చెప్పడం గమనార్హం.
ఇక వన్డే కెప్టెన్‌గా కొనసాగాలనుకున్న రోహిత్ శర్మను తప్పించి.. శుబ్‌మన్ గిల్‌ను సారథి చేయడం వెనుక గంభీర్ హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో రోహిత్ ఇలా తాను రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో ద్రవిడ్‌దే కీలక పాత్ర అని చెప్పడం గమనార్హం. పరోక్షంగా గంభీర్‌కు హిట్‌మ్యాన్ ఇలా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ పలికిన రోహిత్.. వన్డేల్లో కొనసాగుతున్నాడు. మరోవైపు.. శుబ్‌మన్ గిల్ ఇప్పటికే టీమిండియా టెస్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు నాయకుడిగా ఉన్నాడు.
చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్