
ఆగస్ట్ 18.. భారత్ క్రికెట్‌కు సంబంధించి ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు భారత్ క్రికెట్ దిగ్గజాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. 17 ఏళ్ల కిందట (2008) ఈ రోజున విరాట్ కోహ్లి అనే ఢిల్లీ కుర్రాడు జెంటిల్మెన్ గేమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో క్రికెట్ అభిమానులకు పరిచయమయ్యాడు. అనంతరం 2010 జూన్ 12న జింబాబ్వేపై టీ20 అరంగేట్రం.. మరుసటి ఏడాది (2011) జూన్ 20న వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు.
కెరీర్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డా, ఆతర్వాత విరాట్ ఏం చేశాడో ప్రపంచం మొత్తం చూసింది. ఇంకా చూస్తూనే ఉంది. విరాట్ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ, పరుగుల వరద పారిస్తూ ఎన్నో ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. మరెన్నో కొత్త రికార్డులను సృష్టించాడు. గతేడాది టీ20 ఫార్మాట్‌కు.. ఈ ఏడాది టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
ఆగస్ట్ 18.. ఈ రోజు భారత్ మరో స్టార్ బ్యాటర్‌ను ప్రపంచ క్రికెట్‌కు పరిచయం చేసింది. 2018లో ఈ రోజున చిచ్చరపిడుగు రిషబ్ పంత్ టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. గడిచిన ఏడేళ్లలో పంత్ టెస్ట్‌ల్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు అపురూప విజయాలు అందించాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే జరిగింది. అయితే ఈ పర్యటనలో పంత్ చివరి టెస్ట్‌కు ముందు గాయపడి సిరీస్ నుంచి వైదొలిగాడు.
టెస్ట్ అరంగేట్రానికి ముందే పంత్ టీ20 ఫార్మాట్ ద్వారా భారత క్రికెట్‌కు పరిచయమయ్యాడు. 2017 ఫిబ్రవరి 1న పంత్ ఇంగ్లండ్‌తో టీ20తో పొట్టి ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్ట్ అరంగేట్రం తర్వాత అదే ఏడాది అక్టోబర్ 21న పంత్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడు ఫార్మాట్లలో స్థిరపడిన పంత్ మధ్యలో కారు ప్రమాదం కారణంగా కొద్ది కాలం ఆటకు దూరమైనా, ఆతర్వాత తిరిగి జట్టులోకి వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు.
ఆగస్ట్ 18 భారత్ క్రికెట్‌కు మరో చిచ్చరపిడుగును పరిచయం చేసింది. 2023లో ఈ రోజున విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ మెరుపుల తర్వాత భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న రింకూ.. ఐర్లాండ్‌తో మ్యాచ్ ద్వారా టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది డిసెంబర్ 19 రింకూ వన్డేల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే వన్డేల్లో రింకూ కేవలం 2 మ్యాచ్‌లకు మాత్రమే పరిమితయ్యాడు.
తన ఆటతీరు సుదీర్ఘ ఫార్మాట్‌కు సరిపోదు కాబట్టి, రింకూ టెస్ట్ అరంగేట్రం చేయలేదు. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఆడుతూ యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా 5 సిక్సర్లు బాదడంతో రింకూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ మ్యాచ్‌లో రింకూ తన జట్టుకు సంచలన విజయాన్ని అందించడంతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఆకర్శించాడు.