IND VS NZ 3rd ODI: హార్ధిక్‌ను ఆదుకున్న వరుణుడు ధవన్‌ను కరుణిస్తాడా..?

IND VS NZ: Will Third ODI Happen Without Rain Interruption - Sakshi

మాంచి వర్షాకాలంలో న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. వరుణుడి పుణ్యమా అని టీ20 సిరీస్‌ను గెలుచుకోగలిగింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్‌ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచిన హార్ధిక్‌ సేన.. వరుణుడు సహకారంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది.

ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ టీ20 సిరీస్‌ తరహాలోనే సమీకరణాలు మారిపోయాయి. అయితే టీ20 సిరీస్‌లో వరుణుడు టీమిండియా పక్షాన నిలబడగా.. వన్డే సిరీస్‌లో ఆతిధ్య జట్టుకు అనుకూలంగా నిలిచాడు. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలుపుతో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లగా, ఇవాళ (నవంబర్‌ 27) జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణమైంది.

ఈ మ్యాచ్‌ రద్దుతో టీమిండియా సిరీస్‌ గెలుచుకునే అవకాశం కోల్పోయింది. వరుణుడు కరుణించి, ఆట సాధ్యపడి, ఈనెల 30న (బుధవారం) జరిగే మూడో వన్డేలో గెలిస్తే, సిరీస్‌ డ్రా చేసుకునే అవకాశం మాత్రమే టీమిండియా ముందు ఉంది. అయితే, మూడో వన్డేకు వేదిక అయిన క్రైస్ట్‌చర్చ్‌లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో టీమిండియా సిరీస్‌పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకవేళ వరుణుడు కటాక్షించక, మూడో వన్డే రద్దైతే.. తొలి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్‌ సిరీస్‌ విజేతగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌లో హార్ధిక్‌ను ఆదుకున్న వరుణుడు.. ధవన్‌కు వన్డే సిరీస్‌ను కనీసం డ్రా చేసుకునే అవకాశాన్నైనా కల్పిస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top