గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 25) జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓ అవమానకర రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటైన (తొలి బంతికే ఔట్) శాంసన్.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు.
ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్, శాంసన్ భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తలో ఏడు సార్లు గోల్డెన్ డకౌట్లు అయ్యారు. విరాట్ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్‌లు తీసుకుంటే, శాంసన్ కేవలం 47 మ్యాచ్‌ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో మరో దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ తన 151 మ్యాచ్‌ల అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఏకంగా 12 సార్లు ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్స్
- 12 – రోహిత్ శర్మ (151 మ్యాచ్‌లు)
- 7 – సంజు సాంసన్ (47 మ్యాచ్‌లు)*
- 7 – విరాట్ కోహ్లీ (117 మ్యాచ్‌లు)
- 6 – సూర్యకుమార్ యాదవ్ (96 మ్యాచ్‌లు)
- 5 – కేఎల్ రాహుల్ (68 మ్యాచ్‌లు)
మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలనే ఛేదించిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. న్యూజిలాండ్‌ను 153 పరుగులకే (9 వికెట్లకు) కట్టడి చేసింది. బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్ (4-0-18-2), హార్దిక్ (3-0-23-2), హర్షిత్ రాణా (4-0-35-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. చాప్‌మన్ (32), సాంట్నర్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆతర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత గెలుపును ఆదిలోనే ఖరారు చేశారు.
వీరిద్దరూ ప్రతి బంతిని బౌండరీ, సిక్సర్‌గా తరలించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడారు. ఇషాన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అభిషేక్, ఇషాన్ విధ్వంసాన్ని కొనసాగించాడు.
వీరిద్దరి ధాటికి భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 68 పరుగులు.. స్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసి టీమిండియాకు మెరుపు విజయాన్ని అందించారు.
శాంసన్ ఫామ్‌పై ఆందోళనలు
ఈ సిరీస్‌లో శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 10, 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా సిరీస్‌లోనూ శాంసన్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. అయినా అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది.
వరస వైఫల్యాల నేపథ్యంలో శాంసన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అతనికి పోటీగా ఇషాన్ కిషన్ దూసుకొస్తున్నాడు. ఇషాన్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శాంసన్ స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఇషాన్ కాకపోయినా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేరును సెలెక్టర్లు పరిశీలించవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.


