Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీ.. ఇప్పుడు ‍కింగ్‌?

Ind Vs NZ 3rd ODI Indore H2H: Predicted Playing XI Pitch Condition - Sakshi

క్లీన్‌ స్వీప్‌ లక్ష్యంగా...

India vs New Zealand, 3rd ODI-ఇండోర్‌: ఇప్పటికే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ వశమైంది. నంబర్‌వన్‌ స్థానం దక్కింది. ఇప్పుడు టీమిండియా క్లీన్‌స్వీప్‌తో టాప్‌ ర్యాంక్‌ను పదిలప రుచుకునే పనిలో పడింది. మొదటి మ్యాచ్‌లో బ్యాట్‌తో, రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌తో పర్యాటక జట్టును దెబ్బమీద దెబ్బ వేసిన భారత్‌ మంగళవారం నాటి చివరిదైన మూడో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాలని పట్టుదలతో ఉంది.

పరువు నిలబెట్టుకోవాలంటే
మరోవైపు కివీస్‌ను ఫలితాలే కాదు... బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా పరేషాన్‌ చేస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో టాప్‌–5 బ్యాటర్స్‌లో ఏ ఒక్కరు కూడా అర్ధసెంచరీ అయినా చేయలేకపోయారు. ఇది జట్టు మేనేజ్‌మెంట్‌ను కల వరపెడుతోంది. పరువు నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు బ్యాటింగ్‌ గేర్‌ మార్చుకోవాల్సిందే. లేదంటే సిరీస్‌ చేజార్చుకున్న న్యూజిలాండ్‌ ఆఖరి పోరు లోనూ ఓడితే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ వేదికపై ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.

కోహ్లి స్కోరే బాకీ!
ఈ ఏడాది వరుసగా ఐదు వన్డేలు (లంకపై 3) గెలిచిన టీమిండియా వరల్డ్‌కప్‌ సన్నాహానికి ఘనమైన ఆరంభమే ఇచ్చింది. కాబట్టి భారత జట్టు ఏ బెంగా, ఒత్తిడి లేకుండా యథేచ్చగా చెలరేగడం ఖాయం. ఇక ఈ సిరీస్‌లో ఏమైనా మిగిలింది... చూడాల్సింది ఉందంటే అది కోహ్లి క్లాసిక్సే!

శ్రీలంకపై తన శైలి శతకాలతో పాత కోహ్లిని తలపించిన అతను ఈ సిరీస్‌లో 8, 11 పరుగులే చేశాడు. అతని ఫామ్‌పై జట్టు మేనేజ్‌మెంట్‌లో ఏ ఒక్కరికీ అనుమానమే లేదు. కానీ తన మార్క్‌ బ్యాటింగ్‌ జోరు చూడాలని జట్టే కాదు... యావత్‌ భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

పిచ్, వాతావరణం
ఫ్లాట్‌ పిచ్‌ ఇది. పైగా గ్రౌండ్‌ చిన్నది కావడంతో ప్రేక్షకులకు పరుగుల విందు గ్యారంటీ. టాస్‌ నెగ్గిన జట్టు బౌలింగ్‌ ఎంచుకుంటుంది. వాన లేదు. మంచు ప్రభావం బౌలర్లపై పడుతుంది.

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి, ఇషాన్ కిషన్‌, సూర్యకుమార్ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్, మహ్మద్‌ సిరాజ్, శార్దుల్ ఠాకూర్‌, కుల్దీప్ యాదవ్‌, షమీ/ఉమ్రాన్‌.
న్యూజిలాండ్‌: లాథమ్‌ (కెప్టెన్‌), అలెన్, కాన్వే, నికోల్స్‌/చాప్‌మన్, మిచెల్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్, షిప్లే/డఫీ, టిక్నెర్, ఫెర్గూసన్‌.

ఇండోర్‌లో ఇలా.. అప్పుడు సెహ్వాగ్‌.. ఇప్పుడు?
ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం వేదికగా ఇప్పటి వరకు భారత్‌ ఐదు వన్డేలు ఆడగా... ఐదింటిలోనూ విజయం సాధించింది. 2011లో వెస్టిండీస్‌తో ఇక్కడే జరిగిన వన్డేలో వీరేంద్ర సెహ్వాగ్‌ (219) డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు.

కాగా ఇటీవల ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌ వంటి యువ బ్యాటర్లు వన్డేల్లో డబుల్‌ సెంచరీలతో చెలరేగిన వేళ.. ఇండోర్‌లో ఈసారి సెహ్వాగ్‌ మాదిరి కోహ్లి బ్యాట్‌ ఝులిపించి ఈ మైదానంలో ద్విశతకం బాదాలని అభిమానులు ఆశపడుతున్నారు.

11వసారి
ఇక ఈ మైదానంలో భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలిసారి వన్డే జరగనుంది. నేడు జరిగే వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్‌ గెలిస్తే స్వదేశంలో 11వసారి ద్వైపాక్షిక సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ అవుతుంది.

మహాకాళేశ్వరుడి సేవలో...
ఇండోర్‌లోని సుప్రసిద్ధ శైవక్షేత్రం ఉజ్జయినిలోని శ్రీ మహాకాళే శ్వరుడిని భారత క్రికెటర్లు, అంపైర్లు, మ్యాచ్‌ అధికారులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం భస్మా హారతి సేవలో ఆటగాళ్లంతా తరించారు. వాషింగ్టన్‌ సుందర్, కుల్దీప్‌ యాదవ్, సూర్యకుమార్‌ యాదవ్‌లు జలాభిషేకం చేశారు.

కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై జట్టుకు దూరమైన సహచ రుడు రిషభ్‌ పంత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు ఆటగాళ్లు తెలిపారు. స్వామి వారి దర్శనానంతరం ఉజ్జయిని లోక్‌సభ ఎంపీ అనిల్‌ ఫిరోజియా క్రికెటర్లను సత్కరించారు.

చదవండి: క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు 'కింగ్‌ కోహ్లి'.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం
BBL 2022-23: స్టీవ్‌ స్మిత్‌కు ఏమైంది, అస్సలు ఆగట్లేదు.. మరోసారి విధ్వంసం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top