అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్‌ | IND VS NZ 1st T20I: Surya kumar yadav completes 9000 runs in t20s | Sakshi
Sakshi News home page

అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్‌

Jan 21 2026 9:31 PM | Updated on Jan 21 2026 9:31 PM

IND VS NZ 1st T20I: Surya kumar yadav completes 9000 runs in t20s

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 32 పరుగులు చేసిన సూర్య భాయ్‌.. పొట్టి క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా అత్యంత వేగంగా (321 ఇన్నింగ్స్‌లు) ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి (271 ఇన్నింగ్స్‌లు), శిఖర్‌ ధవన్‌ (308) సూర్య కంటే ముందున్నారు. ప్రపంచం మొత్తంలో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన రికార్డు పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ పేరిట ఉంది. బాబర్‌ కేవలం 245 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. అభిషేక్‌ విధ్వంసం (35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు), రింకూ సింగ్‌ (20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు) మెరుపుల కారణంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ అతి భారీ స్కోర్‌ (238/7) చేసింది.

మిగతా బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. సూర్య భాయ్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది 100వ మ్యాచ్‌.

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ (10), ఇషాన్‌ కిషన్‌ (8), శివమ్‌ దూబే (9), అక్షర్‌ పటేల్‌ (5) నిరాశపరిచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో డఫీ, జేమీసన్‌ చెరో 2.. క్రిస్టియన్‌ క్లార్క్‌, సోధి, సాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. రెండో బంతికే అర్షదీప్‌ డెవాన్‌ కాన్వేను (0) ఔట్‌ చేశాడు. రెండో ఓవర్‌లో న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్‌ పాండ్యా రచిన్‌ రవీంద్రను (1) పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 39-2గా  ఉంది. రాబిన్సన్‌ (19), గ్లెన్‌ ఫిలిప్స్‌ (18) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవాలంటే 90 బంతుల్లో మరో 200 పరుగులు చేయాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement