
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ రికార్డుపుటల్లోకెక్కింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఏకంగా 50 అర్ద సెంచరీలు బాదారు. టెస్ట్ క్రికెట్ ఆరంభం నుంచి ఓ సిరీస్‌లో అత్యధిక హాఫ్ సెంచరీల సంఖ్య ఇదే. 1993 యాషెస్ సిరీస్‌లోనూ ఇన్నే హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.
తాజాగా టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసింది. ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ చేసిన హాఫ్ సెంచరీ ఈ సిరీస్‌లో 50వది.
టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వ్యక్తిగత 50+ స్కోర్లు
50* - ఇంగ్లండ్‌లో టీమిండియా, 2025
50 - ది యాషెస్, 1993
49 - ది యాషెస్, 1920/21
46 - ఆస్ట్రేలియాలో వెస్టిండీస్, 1960/61
46 - ఆస్ట్రేలియాలో వెస్టిండీస్ 1968/69
మ్యాచ్ విషయానికొస్తే.. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. నాలుగో రోజు రెండో సెషన్ డ్రింక్స్ విరామ సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి ఇంకా 128 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. ఆ జట్టు స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 246/3గా ఉంది.
క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (59), బ్రూక్ (82) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.