
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 6000 పరుగులు (69 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ ఈ ఘనత సాధించాడు.
టీమిండియా నిర్దేశించిన 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ డబ్ల్యూటీసీలో 6000 పరుగుల మైలురాయిని తాకాడు.
డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్ (4278), మార్నస్ లబూషేన్ (4225), బెన్ స్టోక్స్ (3616), ట్రవిస్ హెడ్ (3300) రూట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూట్ డబ్ల్యూటీసీలో 20 సెంచరీలు, 22 అర్ద సెంచరీలు చేయడం గమనార్హం.
మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ నిర్దేశించిన లక్ష్యానికి ఇంగ్లండ్ మరో 81 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. హ్యారీ బ్రూక్ (103) అద్భుతమైన సెంచరీతో ఇంగ్లండ్ గెలుపుకు బాటలు వేస్తున్నాడు. రూట్ 83 పరుగుల వద్ద బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ అతనికి సహకరిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోర్ 293/3గా ఉంది.
క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (59), బ్రూక్ (82) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.