Ind Vs Ban 2nd ODI: కచ్చితంగా గెలుస్తాం.. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు!

Ind Vs Ban 2nd ODI Dhawan: He Will Be Great All Rounder In World - Sakshi

India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 2nd ODI: ‘‘సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ ఓడటం మాకేమీ కొత్తకాదు. ఇదే తొలిసారి కూడా కాదు. కఠిన పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో మాకు తెలుసు’’ టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో తక్కువ స్కోరుకు పరిమితం కావడం ప్రభావం చూపిందని.. అయితే, ప్రతిసారి ఇలాగే జరగదని వ్యాఖ్యానించాడు. రెండో మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించి సిరీస్‌ను సమం చేస్తామని గబ్బర్‌ ధీమా వ్యక్తం చేశాడు.

బంగ్లా పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రోహిత్‌ సేన మొదటి మ్యాచ్‌లో ఒక వికెట్‌ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢాకా వేదికగా బుధవారం రెండో వన్డేలో తలపడనుంది.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ధావన్‌.. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని, కచ్చితంగా తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో కండరాల నొప్పితో బాధపడ్డ శార్దూల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడని.. రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపాడు. 

న్యూజిలాండ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన వాషీ!
బంగ్లాతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ధావన్‌.. టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని కితాబులిచ్చాడు.

కాగా గాయాల బెడదతో కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన వాషింగ్టన్‌ సుందర్‌.. న్యూజిలాండ్‌ పర్యటనలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి వన్డేలో మెరుపు ఇన్నింగ్స్‌తో అర్ధ శతకం సాధించాడు. 

అతడు గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు
ఈ నేపథ్యంలో ధావన్‌ మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. పునరాగమనంలో సత్తా చాటుతున్నాడు. న్యూజిలాండ్‌లో అతడి ప్రదర్శన మనమంతా చూశాం. తను మంచి ఆల్‌రౌండర్‌.

ఆఫ్‌ స్పిన్నర్‌గా.. లోయర్‌ ఆర్డర్‌లో ఫినిషర్‌గా జట్టుకు ఉపయోగపడతాడు. అనుభవం గడిస్తున్న కొద్దీ తను మరింత రాటుదేలతాడు. ఒత్తిడిలోనూ రాణించగల సుందర్‌.. ప్రపంచంలో గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని నమ్మకంగా చెప్పగలను’’ అని వాషీని ప్రశంసించాడు.

కాగా బంగ్లాతో మొదటి వన్డేలో 10 పరుగులు చేసిన వాషింగ్టన్‌ సుందర్‌.. 2 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌ టూర్‌లో వన్డే సిరీస్‌ ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా.. 1-0తో టీమిండియా ట్రోఫీని ఆతిథ్య జట్టుకు అప్పగించింది. ప్రస్తుతం రెండో వన్డేలో గెలిస్తేనే బంగ్లా చేతిలో సిరీస్‌ ఓటమి నుంచి తప్పించుకోగలదు.

చదవండిInd A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్‌.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్‌
IPL 2023: విండీస్‌ విధ్వంసకర ఆల్‌రౌండర్‌పై కన్నేసిన రాజస్తాన్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top