టీమిండియా స్టార్ పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో రేపు (నవంబర్ 8) జరుగబోయే ఐదో టీ20లో (India vs Australia) ఓ వికెట్ తీస్తే.. టీ20 ఫార్మాట్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకోవడంతో పాటు మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.
ఇప్పటివరకు ఏ భారత బౌలర్ మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీయలేదు. టీ20ల్లో అర్షదీప్ సింగ్ మాత్రమే ఇప్పటివరకు 100 వికెట్లు పూర్తి చేశాడు. రేపటి మ్యాచ్‌లో బుమ్రా ఓ వికెట్ తీస్తే.. టీ20ల్లో సెంచరీ కొట్టిన రెండో భారత బౌలర్‌గా నిలుస్తాడు.
ప్రస్తుతం బుమ్రా 79 టీ20ల్లో 99 వికెట్లు తీశాడు. అర్షదీప్ 67 మ్యాచ్‌ల్లో 105 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 108 టీ20ల్లో 182 వికెట్లు తీసి, ప్రస్తుత తరం బౌలర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
అరుదైన మైలురాయికి చేరువలో అభిషేక్, తిలక్
రేపటి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కూడా ఓ అరుదైన మైలురాయిపై కన్నేశారు. అభిషేక్ 11, తిలక్ 4 పరుగులు చేస్తే టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంటారు. రేపటి మ్యాచ్‌లో ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు కూడా ఓ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. స్టోయినిస్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీస్తే టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకుంటారు.
ఇదిలా ఉంటే, భారత్-ఆసీస్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేలుస్తుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ వరుసగా మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచి 2-1 ఆధిక్యంలో ఉంది. రేపటి మ్యాచ్‌లోనూ గెలిస్తే టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో పాటు సిరీస్ కైవసం చేసుకుంటుంది.
తద్వారా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించిన ఘనతను సొంతం చేసుకుంటుంది. బ్రిస్బేన్ వేదికగా జరుగబోయే రేపటి మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు మొదలవుతుంది.
తుది జట్లు (అంచనా)..
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (సి), మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (డబ్ల్యుకె), జోష్ ఫిలిప్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, ఆడమ్ జంపా
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (సి), జితేష్ శర్మ (WK), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
చదవండి: పాక్ బౌలర్ ఓవరాక్షన్.. టీమిండియా ప్లేయర్ల పట్ల అనుచిత ప్రవర్తన


