హాంగ్‌కాంగ్ సిక్సస్-2025 టోర్నీలో ఇవాళ (నవంబర్ 7) భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. మాంగ్ కాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ ఛేదిస్తుండగా వర్షం మొదలైంది. ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేయగా.. పాక్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగుల స్కోర్ వద్ద ఉండగా మ్యాచ్ ఆగిపోయింది. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), భరత్ చిప్లి (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడారు.
ఆఖర్లో కెప్టెన్ దినేశ్ కార్తిక్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించాడు. స్టువర్ట్ బిన్ని 4, మిథున్ 6 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ముహమ్మద్ షెహజాద్ 2, అబ్దుల్ సమద్ ఓ వికెట్ తీశారు.
పాక్ ఇన్నింగ్స్‌లో మాజ్ సదాఖత్ 7 పరుగులు చేసి ఔట్ కాగా.. మ్యాచ్ ముగిసే సమయానికి ఖ్వాజా నఫే (18 నాటౌట్), అబ్దుల్ సమద్ (16 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో కువైట్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 8న జరుగుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 6:40 గంటలకు మొదలవుతోంది.
పాక్ బౌలర్ ఓవరాక్షన్
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్ ముహమ్మద్ షెహజాద్ భారత ప్లేయర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఉతప్ప, బిన్నీ వికెట్లు తీశాక పెదాలపై వేలు పెట్టుకొని సైలెంట్ అన్న అర్దం వచ్చేలా ఓవరాక్షన్ చేశాడు. షెహజాద్ అతిని టీమిండియా ఆటగాళ్లు పట్టించుకోకపోయినా భారత అభిమానులు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎన్ని సార్లు బుద్ది చెప్పినా కుక్క తొక వంకర అన్న చందంగా ప్రవరిస్తారంటూ చురలంటిస్తున్నారు. షెహజాద్.. అంత ఓవరాక్షన్ వద్దంటూ సోషల్‌మీడియా వేదికగా ఏకీ పారేస్తున్నారు.
కాగా, ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో కూడా పాక్ ఆటగాళ్లు ఇలాగే ఓవరాక్షన్ చేశారు. ఇందుకు ప్రతిగా భారత ఆటగాళ్లు వారికి చేయాల్సిన మర్యాదంతా చేశారు. ఆ టోర్నీలో పాక్‌ను ఫైనల్ సహా మూడుసార్లు ఓడించి, వారి స్థాయిని వారికి చూపించారు. అయినా పాక్ ఆటగాళ్లు సిగ్గు లేకుండా భారత ఆటగాళ్లు ఎదురుపడిన ప్రతిసారి ఏదో ఓవరాక్షన్ చేస్తూ చీవాట్లు తింటూనే ఉన్నారు.
ఆసియా కప్, మహిళల వన్డే ప్రపంచకప్‌లో వారి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ నిరాకరించినా వారి ప్రవర్తనలో మార్పు లేదు. వారి క్రికెట్ చీఫ్ నుంచి ఆసియా కప్‌ను తీసుకునేందుకు నిరాకరించి, అవమానించినా తుడుచుకుని వెళ్లిపోయారు.
పైగా వారి క్రికెట్ చీఫ్ సిగ్గు లేకుండా ఆసియా కప్‌ను ఎత్తుకెళ్లి, యావత్ క్రికెట్ సమాజం నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. పహల్గాం ఉదంతం ఆతర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్ తాట తీసిన విషయం తెలిసిందే.
చదవండి: అభిషేక్ శర్మపై సూర్యకుమార్ సెటైర్లు.. ‘విధ్వంసకర’ ఓపెనర్ రియాక్షన్ ఇదే


