టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘సింహం గడ్డి తినడం ఎప్పుడైనా చూశారా? .. ఈరోజు సింహం మెల్లమెల్లగా గడ్డి తినడం మొదలుపెట్టింది’’ అంటూ సరదాగా సెటైర్లు వేశాడు. ఇంతకీ ఇందుకు కారణం ఏమిటంటే?..
మెరుగ్గానే..
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ (IND vs AUS T20Is)లో అభిషేక్ శర్మ మెరుగ్గా రాణిస్తున్నాడు. కాన్‌బెర్రా వేదికగా వర్షం కారణంగా అర్థంతరంగా రద్దైపోయిన తొలి టీ20లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 14 బంతుల్లో 19 (4 ఫోర్లు, స్ట్రైక్ రేటు- 135.71) పరుగులు రాబట్టాడు.
ఇక మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20లో అభిషేక్ ధనాధన్ దంచికొట్టాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం 37 బంతుల్లోనే 68 పరుగులతో చెలరేగాడు. ఇందులో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 183.78.
అదే విధంగా..హోబర్ట్‌లో జరిగిన మూడో టీ20లోనూ అభిషేక్ ఫర్వాలేదనిపించాడు. 16 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 156కు పైగా స్ట్రైక్‌రేటుతో 25 పరుగులు చేశాడు. అయితే, క్వీన్స్‌లాండ్‌లో గురువారం ముగిసిన నాలుగో టీ20లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 21 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది.. 28 రన్స్ రాబట్టాడు. స్ట్రైక్‌రేటు 133.33.
2-1తో ఆధిక్యంలో
ఇక ఆసీస్‌తో ఇప్పటికి నాలుగు టీ20లు ముగించుకున్న టీమిండియా.. రెండో టీ20లో ఓడి.. వరుసగా మూడు, నాలుగో మ్యాచ్‌లో గెలిచింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య శనివారం బ్రిస్బేన్‌లో నిర్ణయాత్మక ఐదో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
నవ్వుతూనే సెటైర్లు.. అభిషేక్ రియాక్షన్ ఇదే
ఈ నేపథ్యంలో బ్రిస్బేన్‌కు పయనమవుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్ శర్మతో సరదాగా అన్న మాటలు వైరల్‌గా మారాయి. నాలుగో టీ20లో అభిషేక్ స్ట్రైక్‌రేటును ఉద్దేశించి.. ‘‘సింహం గడ్డి తింటుందా? కానీ ఇప్పుడు అదే జరుగుతోంది’’ అంటూ నవ్వుతూనే సెటైర్లు వేశాడు. ఇందుకు బిత్తరపోయిన అభిషేక్ తేరుకుని.. తనూ గట్టిగా నవ్వేశాడు.
కాగా నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్.. నాలుగో స్థానంలో వచ్చి 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. ఈ క్రమంలో ఆఖరిదైన ఐదో టీ20లోనూ ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా
ఇదిలా ఉంటే.. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా చేదు అనుభవం చవిచూసింది. ఆతిథ్య ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. దీంతో వన్డే కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే గిల్ ఓటమి రుచిచూశాడు. అంతకు ముందు ఇంగ్లండ్ పర్యటనతో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన గిల్ 2-2తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసి ఫర్వాలేదనిపించాడు.
చదవండి: ‘గిల్ కోసం బలి.. సంజూను కాదని జితేశ్ శర్మను అందుకే ఆడిస్తున్నారు’
SuryaKumar Yadav on Abhishek Sharma slow inning 😅#INDvsAUS #SuryakumarYadav pic.twitter.com/aRdMXjtMWQ
— Vishal kr (@vishal_kr_31) November 6, 2025


