ముసలాడివి నువ్వేం చేస్తావన్నారు.. అశ్విన్‌కు థ్యాంక్స్‌: ఇమ్రాన్‌ తాహిర్‌ | Imran Tahir Thanked Ashwin For Believing In Winning CPL 2023 Title - Sakshi
Sakshi News home page

CPL 2023: ముసలాడివి నువ్వేం చేస్తావన్నారు.. అశ్విన్‌కు థ్యాంక్స్‌: ఇమ్రాన్‌ తాహిర్‌

Sep 25 2023 3:59 PM | Updated on Sep 25 2023 6:01 PM

Imran Tahir Thanked Ashwin For Believing In Winning CPL 2023 Title - Sakshi

పాకిస్తాన్‌ బార్న్‌ సౌతాఫ్రికా వెటరన్‌ ప్లేయర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ అద్భుతం చేశాడు. 44 ఏళ్ల వయసులో గయానా అమెజాన్‌ వారియర్స్‌కు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిల్‌ను అందించి, ఆటకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు. వయసును సాకుగా చూపి తనను ఎగతాళి చేసిన వారందరిని నోళ్లను తాహిర్‌ సీపీఎల్‌ 2023 టైటిల్‌తో మూయించాడు.

ముసలాడివి.. నువ్వేం చేస్తావ్‌ అని తనపై జోకులు పేల్చిన వారికి తాహిర్‌ టైటిల్‌తో బుద్ది చెప్పాడు. 11 ఎడిషన్లలో నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచిన వారియర్స్‌ను తాహిర్‌ ఐదవ ప్రయత్నంలో ఛాంపియన్‌గా నిలబెట్టి, పట్టుదలతో ప్రయత్నిస్తే కాదేదీ అనర్హం అని నిరూపించాడు. కాగా, వారియర్స్‌ టైటిల్‌ గెలిచిన అనంతరం తాహిర్‌ టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు. 

తన చుట్టూ ఉన్న చాలామంది తన వయసుపై జోకులు పేలుస్తున్న సమయంలో అశ్విన్‌ తనపై విశ్వాసం వ్యక్తం చేశాడని,  తాను వారియర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు అందరూ తనపై జోకులు పేల్చారని, తాను ఈ ఎడిషన్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిల్‌ సాధిస్తానని యాష్‌ ముందు నుంచే గట్టిగా నమ్మి వెన్నుతట్టాడని తాహిర్‌ అన్నాడు. వయసు పైబడిన నాపై నమ్మకాన్ని ఉంచి, తనలో సూర్తిని రగిల్చినందుకు యాష్‌కు ధన్యవాదాలని తాహిర్‌ తెలిపాడు. 

ధోని రికార్డు బద్దలు కొట్టిన తాహిర్‌..
44 ఏళ్ల వయసులో వారియర్స్‌ను ముందుండి నడిపించి కరీబియన్‌  ఛాంపియన్‌గా నిలిపిన తాహిర్‌.. దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ధోని 41 ఏ‍ళ్ల 325 రోజుల్లో తన ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలబెడితే.. తాహిర్‌ 44 ఏళ్ల 181 రోజుల్లో అమెజాన్‌ వారియర్స్‌కు టైటిల్‌ను అందించి, లేటు వయసులో టీ20 టైటిల్‌ను అందించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

కాగా, నిన్న జరిగిన సీపీఎల్‌ 2023 ఫైనల్లో తాహిర్‌ సారథ్యం వహించిన గయానా అమెజాన్‌ వారియర్స్‌.. విధ్వంసకర ఆటగాళ్లతో నిండిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, తొట్టతొలి సీపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ 18.1 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలగా.. వారియర్స్‌ ఆడుతూపాడుతూ 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని విజేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్‌లో తాహిర్‌ అత్యంత పొదుపుగా బౌలింగ్‌ (4-0-8-2) చేసి వారియర్స్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement