పొట్టి ​ప్రపంచకప్‌పై ఐపీఎల్‌ ప్రభావమెంత..? | Sakshi
Sakshi News home page

పొట్టి ​ప్రపంచకప్‌పై ఐపీఎల్‌ ప్రభావమెంత..?

Published Mon, May 27 2024 11:03 AM

Is There Any Impact Of IPL On T20 World Cup 2024

రెండు నెలలకు పైగా జరిగిన క్రికెట్‌ పండుగ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిన్నటితో (మే 26) ముగిసింది. ఈ సీజన్‌ ఫైనల్లో కేకేఆర్‌.. సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్‌ ముగిసిన ఐదు రోజుల్లోనే మరో మహా క్రికెట్‌ సంగ్రామం మొదలుకానుంది. యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ దాదాపుగా నెల రోజుల పాటు అభిమానులకు కనువిందు చేయనుంది.

పొట్టి ప్రపంచకప్‌ ఐసీసీ ఈవెంట్‌ కావడంతో అభిమానుల్లో అమితాసక్తి నెలకొని ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే టోర్నీ కావడంతో తీవ్ర భావోద్వేగాలు ఉంటాయి. ఈ సారి వరల్ఢ్‌కప్‌లో గతంలో ఎన్నడూ లేనట్లుగా 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌కు ఐదు జట్ల చొప్పున మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. భారత్.. చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో కలిసి గ్రూప్‌-ఏలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో భారత్‌, పాక్‌లతో పాటు యూఎస్‌ఏ, ఐర్లాండ్‌, కెనడా దేశాలు ఉన్నాయి.  

ఐపీఎల్‌ 2024 సీజన్‌ రెండు నెలల సుదీర్ఘ కాలంపాటు సాగిన నేపథ్యంలో ఓ ఆసక్తిర ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు (దాదాపుగా)  చెందిన ఆటగాళ్లు ఇన్ని రోజుల పాటు ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో ఈ లీగ్‌ ప్రభావం పొట్టి ప్రపంచకప్‌పై ఏమేరకు పడనుందనే ప్రశ్న తలెత్తుతుంది. ఐపీఎల్‌ ముగిసి వారం రోజులు కూడా గడువక ముందే పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభంకావడం మంచిదేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్‌ సుదీర్ఘకాలం పాటు సాగడం వల్ల ఆటగాళ్లు అలసిపోయుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌ ప్రభావం ఆటగాళ్లపై నెగిటివ్‌గా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌ కారణంగా ఆటగాళ్లలో సీరియస్‌నెస్‌ కొరవడిందని కొందరంటున్నారు. ఐపీఎల్‌లో ఆడి కొందరు ఆటగాళ్లు గాయాల బారిన పడిన విషయాన్ని ఇంకొందరు ప్రస్తావిస్తున్నారు. ఐపీఎల్‌లో లభించే డబ్బును చూసుకుని కొందరు ఆటగాళ్లు దేశీయ విధులపై ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్‌ ముగిసి వారం కూడా గడవక ముందే మెగా టోర్నీ నిర్వహించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఐపీఎల్‌ వల్ల మంచే జరిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌ వల్ల తమ దేశ ఆటగాళ్లకు మంచే జరిగిందని ఆసీస్‌ అభిమానులు అనుకుంటున్నారు. కిక్కిరిసిన జనాల మధ్య ఐపీఎల్‌ ఆడటం వల్ల తమ దేశ క్రికెటర్లకు ఒత్తిడిని ఎదుర్కోవాలో తెలిసొచ్చి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. 

ఇదే విషయంతో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ సైతం ఏకీభవించాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ ఆడనీయకుండా తప్పుచేసిందని అతను అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌ ఆడి ఉంటే పొట్టి ప్రపంచకప్‌ ఇంకాస్త ఎక్కువగా సన్నద్దమయ్యేవారని వాన్‌ అన్నాడు.

భారత ఆటగాళ్ల విషయానికొస్తే.. ఐపీఎల్‌ ప్రతిభే కొలమానంగా ప్రపంచకప్‌ జట్టు ఎంపిక జరిగింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు మాత్రమే ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది. జట్టులో స్థానం విషయంలో సెలెక్టర్లు ఎలాంటి ములాజలకు పోకుండా అర్హులైన వారినే ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు సంబంధించి వ్యూహాలు వేరుగా ఉన్నప్పటికీ.. ఐపీఎల్‌ వల్ల భారత ఆటగాళ్లకు మేలే జరిగిందని చెప్పాలి. 

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కీలక ఆటగాళ్లెవరు గాయాల బారిన పడలేదు. టీ20 జట్టులో రెగ్యులర్‌ సభ్యులైన ఆటగాళ్లందరూ మాంచి ఫామ్‌లో ఉండటంతో జట్టు ఎంపిక​ కూడా చాలా కష్టమైంది. కొన్ని సమీకరణల కారణంగా కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని చెప్పాలి. ఓవరాల్‌గా చూస్తే పొట్టి ప్రపంచకప్‌పై ఐపీఎల్‌ ప్రభావం అనే అంశంపై ఎవరి అభిప్రాయాలను వారు వినిపిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement