ICC World Cup: అఫ్గాన్‌ తీన్‌మార్‌...

ICC World Cup: Afghanistan thrash Sri Lanka by 7 wickets - Sakshi

శ్రీలంకపై ఏడు వికెట్లతో సంచలన విజయం

ఒకే టోర్నీలో మూడు ప్రపంచ చాంపియన్‌ జట్లను ఓడించిన హష్మతుల్లా బృందం

బంతితో మెరిసిన ఫారూఖీ

రహ్మత్‌ షా, హష్మతుల్లా, అజ్మతుల్లా అర్ధ సెంచరీలు  

ఇకపై తమ జట్టును కూనగా పరిగణించాల్సిన అవసరం లేదని అఫ్గానిస్తాన్‌ చాటి చెప్పింది. మేటి జట్లపై తాము సాధిస్తున్న విజయాలు గాలివాటమేమీ కాదని తమ నిలకడైన ప్రదర్శనతో నిరూపించింది.

మూడోసారి వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్న అఫ్గానిస్తాన్‌ ఈసారి తమకంటే అన్ని విభాగాల్లో ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టిస్తూ ఔరా అనిపించింది.డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను కంగుతినిపించిన ఉత్సాహంతో 1992 విశ్వవిజేత పాకిస్తాన్‌ జట్టును కూడా మట్టికరిపించిన అఫ్గానిస్తాన్‌ జట్టు తాజాగా 1996 ప్రపంచ చాంపియన్‌ శ్రీలంకను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.   

పుణే: ప్రత్యర్థి జట్టు గత రికార్డు ఎలా ఉంటేనేమి తమదైన రోజున సమష్టిగా గర్జిస్తే అద్భుత ఫలితం సాధించవచ్చని వన్డే ప్రపంచకప్‌ టోరీ్నలో అఫ్గానిస్తాన్‌ జట్టు మూడోసారి నిరూపించింది. భారీ అంచనాలు పెట్టుకోకుండా ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ మూడో సంచలన విజయంతో అలరించింది. 1996 ప్రపంచ చాంపియన్‌ శ్రీలంక జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హష్మతుల్లా షాహిది నాయకత్వంలోని అఫ్గానిస్తాన్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి అబ్బురపరిచింది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (60 బంతుల్లో 49; 5 ఫోర్లు), కెపె్టన్‌ కుశాల్‌ మెండిస్‌ (50 బంతుల్లో 39; 3 ఫోర్లు), సమరవిక్రమ (40 బంతుల్లో 36; 3 ఫోర్లు), తీక్షణ (31 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫజల్‌హక్‌ ఫారూఖీ (4/34) శ్రీలంక జట్టును దెబ్బ తీశాడు. ఒకదశలో 134/2తో పటిష్టస్థితిలో కనిపించిన శ్రీలంక నిసాంక అవుటయ్యాక తడబడింది. 107 పరుగుల తేడాలో ఏడు వికెట్లు కోల్పోయింది.

కెరీర్‌లో 100వ వన్డే ఆడిన రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీయగా, మరో స్పిన్నర్‌ ముజీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్‌ 45.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ గుర్బాజ్‌ (0) డకౌట్‌కాగా... రహ్మత్‌ షా (74 బంతుల్లో 62; 7 ఫోర్లు), హష్మతుల్లా షాహిది (74 బంతుల్లో 58 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (63 బంతుల్లో 73 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో అఫ్గానిస్తాన్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. హష్మతుల్లా, అజ్మతుల్లా నాలుగో వికెట్‌కు అజేయంగా 111 పరుగులు జోడించడం విశేషం.  

ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓడిపోయిన అఫ్గానిస్తాన్‌... రెండో మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడించి బోణీ కొట్టింది. మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 149 పరుగుల తేడాతో ఓడిపోయి... నాలుగో మ్యాచ్‌లో విజృంభించి 1992 విశ్వవిజేత పాకిస్తాన్‌పై ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది.

అనంతరం అదే ఉత్సాహంతో శ్రీలంకను కూడా మట్టికరిపించి అఫ్గానిస్తాన్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మూడోసారి వన్డే వరల్డ్‌కప్‌లో ఆడుతున్న అఫ్గానిస్తాన్‌ ఒకే ప్రపంచకప్‌లో మూడు విజయాలు సాధించడం ఇదే ప్రథమం. 2015 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో నెగ్గిన అఫ్గానిస్తాన్‌... 2019 ప్రపంచకప్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ ప్రపంచకప్‌లో మాత్రం అఫ్గానిస్తాన్‌ తమ కంటే మెరుగైన జట్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్‌ మిగిలిన మూడు మ్యాచ్‌లను నెదర్లాండ్స్‌ (నవంబర్‌ 3న), ఆ్రస్టేలియా
(నవంబర్‌ 7న), దక్షిణాఫ్రికా (నవంబర్‌ 10న) జట్లతో ఆడుతుంది.  

స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (సి) గుర్బాజ్‌ (బి) అజ్మతుల్లా 46; దిముత్‌ కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫారూఖీ 15; కుశాల్‌ మెండిస్‌ (సి) నజీబుల్లా (సబ్‌) (బి) ముజీబ్‌ 39; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్‌ 36; అసలంక (సి) రషీద్‌ ఖాన్‌ (బి) ఫారూఖీ 22; ధనంజయ డిసిల్వా (బి) రషీద్‌ ఖాన్‌ 14; ఎంజెలో మాథ్యూస్‌ (సి) నబీ (బి) ఫారూఖీ 23; చమీర (రనౌట్‌) 1; తీక్షణ (బి) ఫారూఖీ 29; కసున్‌ రజిత (రనౌట్‌) 5; మదుషంక (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్‌) 241.
వికెట్ల పతనం: 1–22, 2–84, 3–134, 4–139, 5–167, 6–180, 7–185, 8–230, 9–239, 10–241.
బౌలింగ్‌: ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ 10–0–38–2, ఫజల్లఖ్‌ ఫారూఖీ 10–1–34–4, నవీన్‌ ఉల్‌ హక్‌ 6.3–0–47–0, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 7–0–37–1, రషీద్‌ ఖాన్‌ 10–0–50–1,  నబీ 6–0–33–0.

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: రహ్మానుల్లా గుర్బాజ్‌ (బి) మదుషంక 0; ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (సి) కరుణరత్నే (బి) మదుషంక 39; రహ్మత్‌ షా (సి) కరుణరత్నే (బి) రజిత 62; హష్మతుల్లా షాహిది (నాటౌట్‌) 58; అజ్మతుల్లా (నాటౌట్‌) 73; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (45.2 ఓవర్లలో మూడు వికెట్లకు) 242.
వికెట్ల పతనం: 1–0, 2–73, 3–131.
బౌలింగ్‌: మదుషంక 9–0–48–2, రజిత 10–0–48–1, మాథ్యూస్‌ 3–0–18–0, చమీర 9.2–0–51–0, తీక్షణ 10–0–55–0, ధనంజయ డిసిల్వా 4–0–21–0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top