
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోటీల్లో పాకిస్తాన్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. నిన్న (ఏప్రిల్ 14) వెస్టిండీస్‌పై పాక్ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది.
విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, హేలీ మాథ్యూస్, కరిష్క రామ్హరాక్ తలో రెండు వికెట్లు తీయగా.. అష్మిని మునిసర్, ఆలియా అలెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్ (54) హాఫ్ సెంచరీతో రాణించగా.. మునీబా అలీ (33), సిద్రా నవాజ్ (23), అలియా రియాజ్ (20), ఒమైమా సోహైల్ (16), ఫాతిమా సనా (15) రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. ఫాతిమా సనా (7-0-16-3), రమీన్ షమీమ్ (8.2-1-26-2), నష్రా సంధు (10-0-31-2), సదియా ఇక్బాల్ (8-1-31-1) రెచ్చిపోవడంతో 39.2 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఆలియా అలెన్ (22) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
కాగా, పాక్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు జట్లు (మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి.
ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్‌లాండ్ పోటీపడుతున్నాయి. ఈ టోర్నీలో పాక్ 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉంది. పాక్ తర్వాత బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. ఐర్లాండ్, థాయ్‌లాండ్ ఇంకా ఖాతా తెరవలేదు.
ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.