లేదంటే టోర్నీ మొత్తాన్ని పాకిస్తాన్ నుంచి తరలిస్తాం
పీసీబీకి ఐసీసీ హెచ్చరిక
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ‘హైబ్రిడ్ మోడల్’కు అంగీకరించబోమని మంకు పట్టు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని... లేదంటే టోర్నీని పూర్తిగా పాకిస్తాన్ నుంచి తరలిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఆడకుండా టోర్నీని జరుపుతామని కూడా తేల్చేసింది.
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం వర్చువల్‌గా జరిగిన సమావేశం 15 నిమిషాల్లోపే ముగిసింది! ఇందులో ఎలాంటి ఫలితం రాకపోయినా, తాము చెప్పినట్లు చేస్తేనే శనివారం సమావేశం కొనసాగుతుందని కూడా ఐసీసీ పాక్‌కు చెప్పేసింది. దుబాయ్‌లోనే ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నక్వీ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనగా, మిగతా దేశాల బోర్డు సభ్యులంతా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చారు.
ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్‌లే గైర్హాజరు కావడంతో డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. భారత్ మ్యాచ్‌లను మరో దేశంలో నిర్వహిస్తూ ఇతర మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లో జరిపేలా ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్’ మోడల్‌ను పీసీబీ ఇక్కడా తిరస్కరించింది. దీనికి ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పాక్ పరిస్థితిపై వివిధ దేశాలకు సానుభూతి ఉన్నా... ప్రస్తుత స్థితిలో ‘హైబ్రిడ్’ మోడల్‌కు మించి మరో ప్రత్యామ్నాయం లేదని అందరూ అంగీకరించారు.
దీనిని అమలు చేస్తే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ యూఏఈలో జరుగుతాయి. ‘భారత జట్టు టోర్నీ లో లేకపోతే ఏ ప్రసారకర్త అయినా ఐసీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఈ విషయం పాక్‌కూ తెలుసు. కాబట్టి వెంటనే అంగీకరిస్తే శనివారం తుది నిర్ణయం వెలువడవచ్చు’ అని సమావేశంలో పాల్గొన్న సభ్యుడొకరు వెల్లడించారు.
టోర్నీ పాక్ దాటి వెళితే ఆతిథ్య హక్కుల కోసం ఐసీసీ ఇచ్చే 6 మిలియన్ డాలర్లతోపాటు టోర్నీ ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment