
పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి భద్రతా లోపం తలెత్తింది. గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. ఎంతమంది ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా అభిమానులు మాత్రం వారు కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొస్తున్నారు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం లహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించింది.
ఈ క్రమంలో అఫ్గాన్ టీమ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా.. ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. స్టాండ్స్‌లో నుంచి ఓ వ్యక్తి మైదానంలో పరిగెత్తుకుంటూ వచ్చి అఫ్గాన్ ఆటగాళ్లను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే మైదానంలోకి వచ్చి ఆ వ్యక్తిని బయటకు బలవంతంగా తీసుకుళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇదేమి తొలిసారి కాదు..
కాగా ఈ మెగా టోర్నీలో ఓ వ్యక్తి మైదానంలో దూసుకు రావడం ఇదేమి తొలిసారి కాదు. రావల్పిండి వేదికగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని ఓ ఉగ్రవాద సంస్థ మద్దతుదారుడు పిచ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి కివీ స్టార్ రచిన్ రవీంద్రను హత్తుకునే ప్రయత్నం చేశాడు.
ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని బయటకు తీసుకుళ్లారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, పాకిస్తాన్‌లోని ఏ క్రికెట్ వేదికలోకి అతడికి ప్రవేశం లేకుండా నిషేధించారు. కాగా ఈ ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!