ఐసీసీ అవార్డుకు నామినేట్‌ అయిన టీమిండియా ప్లేయర్‌ | ICC Announced Player Of The Month Nominees For July 2024 | Sakshi
Sakshi News home page

ఐసీసీ అవార్డుకు నామినేట్‌ అయిన టీమిండియా ప్లేయర్‌

Aug 5 2024 4:02 PM | Updated on Aug 5 2024 4:12 PM

ICC Announced Player Of The Month Nominees For July 2024

టీమిండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. జులై నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మరో ఇద్దరితో కలిసి సుందర్‌ ఈ అవార్డు రేసులో నిలిచాడు. సుందర్‌తో పాటు ఇంగ్లండ్‌ పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌, స్కాట్లాండ్‌ బౌలర్‌ చార్లీ కాస్సెల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. మహిళల విభాగంలో శ్రీలంక కెప్టెన్‌ చమారీ ఆటపట్టు, టీమిండియా  ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు రేసులో నిలిచారు. వీరందరు జులై నెలలో వివిధ ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు.

గస్‌ అట్కిన్సన్‌: 26 ఏళ్ల అట్కిన్సన్‌ జులై నెలలో స్వదేశంలో విండీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అట్కిన్సన్‌ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.

చార్లీ కాస్సెల్‌: 25 ఏళ్ల కాస్సెల్‌ స్కాట్లాండ్‌ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్సెల్‌ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.

వాషింగ్టన్‌ సుందర్‌: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్‌ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌ మూడో టీ20లో సుందర్‌ సూపర్‌ ఓవర్‌లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్‌లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది.

స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్‌లోనూ (47, 54 నాటౌట్‌) రాణించింది. ఆసియా కప్‌లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.

షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్‌లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement