40 రోజులు రోడ్లపై నిద్రించాం కానీ.. సాక్షి మాలిక్‌ సంచలన ప్రకటన | Sakshi Malik Announces Retirement, Says She Wont Compete Under Presidency Of Brij Bhushan Loyalist, Video Viral - Sakshi
Sakshi News home page

Sakshi Malik Retirement: 40 రోజులు రోడ్లపై నిద్రించాం కానీ.. సాక్షి మాలిక్‌ సంచలన ప్రకటన

Published Thu, Dec 21 2023 5:44 PM

I Quit Wrestling: Sakshi Malik Wont Compete Under Brij Bhushan Loyalist

Sakshi Malik Gets Emotional Video Viral: భారత మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ సంచలన ప్రకటన చేసింది. ఆటకు తాను వీడ్కోలు పలుకనున్నట్లు తెలిపింది. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వంటి వ్యక్తి అనుచరుడి నేతృత్వంలో తాను పోటీల్లో పాల్గొనలేనని.. అంతకంటే ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించడమే మేలు అని వెల్లడించింది.

కాగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సాక్షి మాలిక్, వినేశ్‌ ఫొగట్‌ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి బజరంగ్‌ పునియా, జితేందర్‌ వంటి పురుష రెజ్లర్లు మద్దతుగా నిలిచారు.

అనితా షెరాన్‌కు తప్పని ఓటమి
ఈ క్రమంలో.. అనేక పరిణామాల అనంతరం బ్రిజ్‌ భూషణ్‌ స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఢిల్లీలోని ఒలింపిక్‌ భవన్‌ వేదికగా గురువారం జరిగిన ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్‌ వీర విధేయుడిగా పేరొందిన సంజయ్‌ కుమార్‌ సింగ్‌ గెలుపొందాడు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన మాజీ రెజ్లర్‌ అనితా షెరాన్‌పై విజయం సాధించాడు. 

ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సాక్షి మాలిక్‌ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘దాదాపు నలభై రోజుల పాటు నిరసన చేస్తూ రోడ్లపై నిద్రించాం. దేశంలోని నలుమూలల నుంచి మాకు మద్దతుగా ఎంతో మంది వచ్చారు. 

కన్నీటి పర్యంతమైన సాక్షి
ఒకవేళ బ్రిజ్‌ భూషణ్‌ వ్యాపార భాగస్వామి, అతడి అనుంగు అనుచరుడు భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అయితే, నేను రెజ్లింగ్‌నే వదిలేస్తా’’ అంటూ సాక్షి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక బజరంగ్‌ పునియా మాట్లాడుతూ.. ‘‘బ్రిజ్‌ భూషణ్‌ విశ్వాసపాత్రులెవరూ డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో పాల్గొనరంటూ ప్రభుత్వం మాకిచ్చిన మాటను దురదృష్టవశాత్తూ నిలబెట్టుకోలేకపోయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. 

బ్రిజ్‌ భూషణ్‌కు సన్నిహితుడు
కాగా డబ్ల్యూఎఫ్‌ఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్‌ కుమార్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వ్యక్తి. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో భాగమైన అతడు బ్రిజ్‌ భూషణ్‌కు అత్యంత సన్నిహితుడని సమాచారం. 

ఈ నేపథ్యంలో ఇకపై రెజ్లింగ్‌ సమాఖ్యలో విధివిధానాల రూపకల్పనపై అతడు కచ్చితంగా బ్రిజ్‌ భూషణ్‌ సూచనలు, సలహాలు తీసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సాక్షి మాలిక్‌ వంటి వాళ్లు ఇలాంటి వ్యక్తి నేతృత్వంలో తాము ఆటను కొనసాగించలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement