వయో మోసానికి పాల్పడిన రెజ్లర్లపై వేటు | 30 wrestlers temporarily suspended | Sakshi
Sakshi News home page

వయో మోసానికి పాల్పడిన రెజ్లర్లపై వేటు

Jun 8 2025 2:03 AM | Updated on Jun 8 2025 2:03 AM

30 wrestlers temporarily suspended

30 మందిపై తాత్కాలిక సస్పెన్షన్‌ వేటు

జూనియర్‌ ఈవెంట్లలో పాల్గొనకుండా నిషేధం  

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) వయో మోసానికి పాల్పడిన రెజ్లర్లపై కన్నెర్ర చేసింది. తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలతో జూనియర్, వయో విభాగాల టోర్నీల్లో పాల్గొన్న 30 మంది రెజ్లర్లపై తాత్కాలిక సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆరోపణల నేపథ్యంలో గత నెల ఏకంగా 400 మందిపై విచారణ జరిపినట్లు తెలిసింది. హరియాణాకు చెందిన కొందరు రెజ్లర్లు నకిలీ వయో ధ్రువీకరణ పత్రాలతో జూనియర్‌ స్ధాయి పోటీల్లో పాల్గొంటున్నారు. దీనిపై తరచూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 

ఈసారి ఢిల్లీ ఆఖాడాలకు చెందిన రెజ్లర్లతో పాటు కోచ్‌లు  రెజ్లింగ్‌ సమాఖ్యకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేశారు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో ఈ తతంగమంతా జరుగుతోందని డబ్ల్యూఎఫ్‌ఐ గుర్తించింది. దీంతో విచారణ చేపట్టడంతో 30 మంది పట్టుపడ్డారు. వెంటనే వారిపై నిషేధం విధించి జూనియర్‌ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అనర్హులుగా తేల్చింది. గత కొంతకాలంగా నరేలా జోన్, రోహిని జోన్‌ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

చాలామంది హరియాణాకు చెందిన రెజ్లర్లు ఢిల్లీ నుంచి పోటీపడేందుకు వీలుగా బేగంపుర నుంచి నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు పొందారు. ఇలా 436 కేసులను పరిశీలించిన డబ్ల్యూఎఫ్‌ఐ... వర్ధమాన రెజ్లర్ల జీవితాలతో చెలగాటం ఆడకుండా... వారి భవిష్యత్తును కాలరాయకుండా తాత్కాలిక సస్పెన్షన్, మందలింపుతో సరిపెట్టింది. మరోమారు పునరావృమైతే గట్టి చర్యలుంటాయని హెచ్చరించింది. సస్పెండ్‌కు గురైనవారిలో ఇద్దరు వయసు పైబడిన రెజ్లర్లు బీహార్‌లో జరిగిన ఖేలో ఇండియా క్రీడల్లో పతకాలు కూడా గెలిచారు. దీనిపై నిర్వాహకులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.   

లైంగికల వేధింపులకు పాల్పడిన కోచ్‌ సస్పెండ్‌ 
లైంగిక వేధింపులకు పాల్పడిన కోచ్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెండ్‌ చేసింది. హరియాణాకు చెందిన కోచ్‌ సంజయ్‌ లాథర్‌ ఖేలో ఇండియా క్రీడల సందర్భంగా మహిళా రెజ్లర్లతో అనుచితంగా ప్రవర్తించాడు. పోటీలు ముగిసిన వెంటనే మహిళా రెజ్లర్ల గదులకు వెళ్లేవాడు. అతను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదులు చేయడంతో అతనిపై నిషేధం విధించారు. డబ్ల్యూఎఫ్‌ఐ అంతర్గత కమిటీ ఈ ఆరోపణలపై విచారణ చేపట్టింది. అతనిపై జీవితకాల నిషేధం విధించాలని సూచించింది.  

Advertisement
 
Advertisement
Advertisement