గోండా (ఉత్తరప్రదేశ్): ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మధ్య వివాదం మరింత తీవ్రమైంది. షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చే వరకు టోర్నిలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వరాదని డబ్ల్యూఎఫ్‌ఐ నిర్ణయం తీసుకోగా... తాను పారిపోనని, పోరాటం కొనసాగిస్తానని వినేశ్ స్పష్టం చేసింది. నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నిలో భాగంగా మంగళవారం మహిళల విభాగంలో బౌట్‌లు జరగనున్న నేపథ్యంలో వినేశ్ టోర్నీ జరిగే వేదిక వద్దకు వచ్చింది.
టోర్నిలో పాల్గొనడంపై ఆమె ఇచ్చిన సంబంధిత డాక్యుమెంట్లను తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. సమీపంలో ఆమె ప్రాక్టీస్ చేసుకునేందుకు ప్రయత్నించగా, వామప్ ఏరియా గదికి తాళం కూడా వేశారు. తాను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టకుండా డబ్ల్యూఎఫ్‌ఐ ప్రయత్నిస్తోందని, రిటైర్ కావాలనే విధంగా కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని వినేశ్ ఆరోపించింది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గనని ఆమె స్పష్టం చేసింది.


