స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను అనర్హురాలిగా ప్రకటించడం సరికాదని వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను దేశీయ టోర్నమెంట్‌లలో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటించిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన స్టార్ రెజ్లర్‌తో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని సూచించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ పోటీపడొచ్చా లేదా అనే అంశంపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించి 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్... ఆ తర్వాత రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో తల్లి అయిన వినేశ్... ఇప్పుడు తాజాగా తిరిగి మ్యాట్‌పై అడుగు పెట్టేందుకు ప్రయత్నించగా... డబ్ల్యూఎఫ్‌ఐ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వినేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రసూతి విరామం నుంచి తిరిగి బరిలోకి దిగాలనుకుంటున్న రెజ్లర్‌ను... తల్లి అయినందుకు నిందించకూడదని ధర్మాసనం వెల్లడించింది. దేశంలో మాతృత్వానికి ఎంతో గొప్పదనం ఉందని... వినేశ్ పట్ల రెజ్లింగ్ సమాఖ్య ప్రతీకార ధోరణితో వ్యవహరించకూడదని ధర్మాసనం నొక్కిచెప్పింది.
అంతర్జాతీయ సమాఖ్యలు అనుమతిచ్చాక కూడా దేశం నుంచి మద్దతు లేకపోవడాన్ని తప్పుపట్టింది. 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి వినేశ్ అనర్హతకు గురైన అంశాన్ని దేశం క్రీడాస్ఫూర్తితో స్వాగతించిన విషయాన్ని మరవకూడదని న్యాయస్థానం సూచించింది. అంతకుముందు 2023లో డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పలువురు యువ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేయగా... వారికి మద్దతుగా బజరంగ్, సాక్షి మలిక్‌తో కలిసి వినేశ్ ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేపట్టిన విషయం తెలిసిందే.


