
42 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం
మెరిసిన ఇషాన్ కిషన్, కమిన్స్
లక్నో: ‘ప్లే ఆఫ్స్’కు దూరమైన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ‘ప్లే ఆఫ్స్’ ఆశలపై నీళ్లుచల్లిన రైజర్స్... శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)ని మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. శుక్రవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ 42 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టగా... అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు.
అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (32 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో భయపెట్టినా... చివర్లో ఒత్తిడి పెంచిన రైజర్స్ ఫలితం రాబట్టింది. సన్‌రైజర్స్ కెపె్టన్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఆరంభం నుంచే దంచుడు...
ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రెండో ఓవర్‌లో హెడ్ ఫోర్‌తో ఖాతా తెరవగా... భువనేశ్వర్ వేసిన రెండో ఓవర్‌లో హెడ్ ఫోర్, అభిషేక్ 4, 6 బాదారు. మూడో ఓవర్‌లోనూ అభిషేక్ 4, 6 దంచగా... నాలుగో ఓవర్‌లో ఈ జోడీ 4, 6, 4 కొట్టింది. వీరిద్దరూ మూడు బంతుల వ్యవధిలో అవుట్ కాగా... పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ 71/2తో నిలిచింది. క్లాసెన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... ఇషాన్ కిషన్ నిలకడ కనబర్చాడు.
సుయాశ్ శర్మ వేసిన 11వ ఓవర్‌లో అనికేత్ 6, 4, 6 కొట్టి కాసేపటికే ఔట్ కాగా... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (4) ప్రభావం చూపలేకపోయాడు. అభినవ్ మనోహర్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆఖర్లో బాదే బాధ్యత ఇషాన్ భుజాలకెత్తుకున్నాడు. 28 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న కిషన్... చివర్లో మరింత వేగం పెంచి సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
ఓపెనర్లు మినహా...
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బెంగళూరు... భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవలేదు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో ఫోర్ కొట్టిన కోహ్లి, మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు దంచాడు. నాలుగో ఓవర్ వేసిన హర్షల్‌కు అదే శిక్ష వేశాడు.
కోహ్లి 7 ఫోర్లు కొట్టేవరకు ఒక్క బౌండ్రీ బాదలేకపోయిన సాల్ట్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి చాలెంజర్స్ 72/0తో నలిచింది. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన అనంతరం విరాట్ అవుట్ కాగా... పడిక్కల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.
27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న సాల్ట్ కాసేపటికి వెనుదిరగగా... జితేశ్ శర్మ, రజత్ పాటీదార్ జోరు కొనసాగించారు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 163/3తో నిలిచింది. విజయానికి 36 బంతుల్లో 69 పరుగులు అవసరమైన దశలో... బెంగళూరు బ్యాటర్లు తడబడటంతో పరాజయం తప్పలేదు.

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) సాల్ట్ (బి) ఇన్‌గిడి 34; హెడ్ (సి) షెఫర్డ్ (బి) భువనేశ్వర్ 17; ఇషాన్ కిషన్ (నాటౌట్) 94; క్లాసెన్ (సి) షెఫర్డ్ (బి) సుయాశ్ 24; అనికేత్ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 26; నితీశ్ రెడ్డి (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 4; అభినవ్ మనోహర్ (సి) సాల్ట్ (బి) షెఫర్డ్ 12; కమిన్స్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–54, 2–54, 3–102, 4–145, 5–164, 6–188. బౌలింగ్: యశ్ దయాళ్ 3–0–36–0; భువనేశ్వర్ 4–0–43–1; ఇన్‌గిడి 4–0–51–1; సుయాశ్ శర్మ 3–0–45–1; కృనాల్ పాండ్యా 4–0–38–1; షెఫర్డ్ 2–0–14–2.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫిల్ సాల్ట్ (సి) హర్షల్ (బి) కమిన్స్ 62; కోహ్లి (సి) అభిషేక్ (బి) హర్‡్ష దూబే 43; మయాంక్ (సి) ఇషాన్ (బి) నితీశ్ 11; పాటీదార్ (రనౌట్) 18; జితేశ్ శర్మ (సి) అభినవ్ (బి) ఉనాద్కట్ 24; షెఫర్డ్ (సి అండ్ బి) మలింగ 0; కృనాల్ (హిట్ వికెట్) (బి) కమిన్స్ 8; టిమ్ డేవిడ్ (సి) క్లాసెన్ (బి) మలింగ 1; భువనేశ్వర్ (బి) కమిన్స్ 3; యశ్ దయాళ్ (సి) అభిషేక్ (బి) హర్షల్ పటేల్ 3; ఇన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–80, 2–120, 3–129, 4–173, 5–174, 6–174, 7–179, 8–186, 9–187, 10–189.బౌలింగ్: కమిన్స్ 4–0–28–3; ఉనాద్కట్ 4–0–41–1; హర్షల్ పటేల్ 3.5–0–39–1; ఇషాన్ మలింగ 4–0–37–2; హర్‡్ష దూబే 2–0–20–1; నితీశ్ రెడ్డి 2–0–13–1.
ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ X పంజాబ్
వేదిక: జైపూర్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో