
తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్, చెన్నై ఘనవిజయం
110 పరుగులతో కోల్‌కతాపై సన్‌రైజర్స్ జయభేరి
83 పరుగులతో గుజరాత్‌పై సూపర్ కింగ్స్ గెలుపు
‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో దంచికొట్టాయి. గుజరాత్ టైటాన్స్‌తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్‌ను ముగించాయి. గుజరాత్‌తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో విజృంభిస్తే... నైట్ రైడర్స్ బౌలర్లను క్లాసెన్, హెడ్ చీల్చి చెండాడారు.
సీజన్ ఆరంభ పోరులో రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్ శర్మ, హెడ్ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.
న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్‌లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.
దంచుడే... దంచుడు
మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ తొలి ఓవర్‌లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్... ఫోర్లు, సిక్స్‌లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్‌లో హెడ్ సిక్స్‌తో ఖాతా తెరవగా... అభిషేక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్‌లో 6, 4, 2, 6 బాదిన హెడ్... నాలుగో ఓవర్‌లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్‌లో అభిషేక్ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ 79 పరుగులు చేసింది.
నరైన్ ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన అభిషేక్... మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ కాగా... క్లాసెన్ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్ బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్ ఓవర్‌లో 4, 6, ,6తో క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ అందుకున్నాడు.
హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్ కిషన్ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్ ఓవర్‌లో 2 సిక్స్‌లు కొట్టిన క్లాసెన్... వరుణ్‌కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్ ఓవర్‌లో 6, 4 కొట్టిన
క్లాసెన్... అరోరా బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రింకూ (బి) నరైన్ 32; హెడ్ (సి) రసెల్ (బి) నరైన్ 76; క్లాసెన్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) నోర్జే (బి) వైభవ్ 29; అనికేత్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్ రాణా 3–0–40–0; నరైన్ 4–0–42–2; వరుణ్ చక్రవర్తి 3–0–54–0; రసెల్ 2–0–34–0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) మనోహర్ (బి) మలింగ 9; నరైన్ (బి) ఉనాద్కట్ 31; రహానే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 15; రఘువంశీ (సి) నితీశ్ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్ (బి) హర్ష్ దూబే 9; రసెల్ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్ పాండే (సి) మనోహర్ (బి) ఉనాద్కట్ 37; రమణ్‌దీప్ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్ (సి అండ్ బి) మలింగ 34; వైభవ్ అరోరా (రనౌట్) 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్: కమిన్స్ 2–0–25–0; ఉనాద్కట్ 4–0–24–3; హర్షల్ 2–0–21–0; ఇషాన్ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్ రెడ్డి 1–0–6–0; అభిషేక్ 2–0–25–0.
278/3 ఐపీఎల్‌లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్‌రైజర్స్ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 286/5 పరుగులు చేసింది.
37 సెంచరీకి క్లాసెన్ తీసుకున్న బంతులు. ఐపీఎల్‌లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్ గేల్ (30 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్షద్ ఖాన్ వెసిన రెండో ఓవర్‌లో ఆయుశ్ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది.
భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్ 34; కాన్వే 52; ఉర్విల్ 37; బ్రెవిస్ 57, ప్రసిధ్ కృష్ణ 2/22)
గుజరాత్ టైటాన్స్: 147 ఆలౌట్ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్ 41; అర్షద్ ఖాన్ 20, అన్షుల్ కంబోజ్ 3/13, నూర్ అహ్మద్ 3/21, జడేజా 2/17).
ఐపీఎల్‌లో నేడు
ముంబై X పంజాబ్
వేదిక: జైపూర్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో