
పురుషుల హండ్రెడ్ కాంపిటీషన్ 2025లో నిన్న ఓ ఉత్కంఠ పోరు జరిగింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సథరన్ బ్రేవ్ వికెట్ తేడాతో గెలుపొందింది. 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన తరుణంలో రీస్ టాప్లే బౌండరీ బాది బ్రేవ్‌ను గెలిపించాడు. అప్పటికే బ్రేవ్ 9 వికెట్లు కోల్పోయి ఉండింది. ఏమాత్రం అటు ఇటైనా బ్రేవ్ మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చేది. టాప్లే సాహసోపేతంగా భారీ షాట్ ఆడి బౌండరీ బాదడంతో మ్యాచ్ బ్రేవ్ వశమైంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ (కెప్టెన్) ఫిల్ సాల్ట్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు.
జోస్ బట్లర్ 18 బంతుల్లో 22, క్లాసెన్ 16 బంతుల్లో 15, చాప్‌మన్ 12 బంతుల్లో అజేయమైన 22 పరుగులు చేశారు. బ్రేవ్ బౌలర్లలో తైమాల్ మిల్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. క్రెయిగ్ ఓవర్టన్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో బ్రేవ్ ఆది నుంచి తడబడుతూ వచ్చింది. జట్టులో ఏ ఒక్క ఆటగాడూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అయితే ఆఖర్లో ఓవర్టన్ (8 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) అనూహ్యంగా బ్యాట్ ఝులిపించి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు.
చివరి ఓవర్‌లో (5 బంతులు) బ్రేవ్ మరోసారి తడబడింది. గ్రెగరీ తొలి రెండు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చి మూడో బంతికి వికెట్ తీశాడు. తద్వారా బ్రేవ్ 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ తరుణంలో రీస్ టాప్లే బౌండరీ బాది బ్రేవ్‌ను గెలిపించాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో గెలుపొందిన సథరన్ బ్రేవ్‌ను ఈ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్ ఫ్రాంచైజీ) యాజమాన్యమైన జీఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. ఇందులో 49 శాతం వాటాను డీసీ మేనేజ్‌మెంట్ సొంతం చేసుకుంది. మిగతా 51 శాతం వాటాను హ్యాంప్‌షైర్ కౌంటీ క్లబ్ రీటైన్ చేసుకుంది. ఈ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా జేమ్స్ విన్స్ వ్యవహరిస్తున్నాడు.