
టైటిల్ లక్ష్యంగా సాత్విక్–చిరాగ్ జోడీ
నేటి నుంచి హాంకాంగ్ ఓపెన్
హాంకాంగ్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తాజా కాంస్య పతకంతో జోరు మీదున్న భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి హంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పురుషుల డబుల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకు ద్వయం ఇటీవల పారిస్‌లో జరిగిన ఈవెంట్‌లో సత్తా చాటుకుంది. భారత బ్యాడ్మింటన్‌లోనే అత్యంత నిలకడైన షట్లర్లుగా ఖ్యాతి గాంచిన వీరిద్దరు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ ఈవెంట్లలో సెమీఫైనల్, ఫైనల్స్ చేరారు.
ఇండియా ఓపెన్ సహా మలేసియా, చైనా, సింగపూర్ టోర్నీల్లో రాణించిన సాత్విక్–చిరాగ్ జంటకు హాంకాంగ్ టోర్నీలో ఎనిమిదో సీడ్ కేటాయించారు. పురుషుల డబుల్స్ తొలి మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ భారత జోడీ తొలి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన చియు హియాంగ్–వాంగ్ చి లిన్ జంటతో తలపడనుంది.
సింధు సత్తా చాటేనా!
రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత, భారత స్టార్ పీవీ సింధు ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ పయనంలో ఆమె తనకన్నా ర్యాంకింగ్‌లో మెరుగైనా చైనా సూపర్‌స్టార్ వాంగ్ జి యిని కంగుతినిపించి తన పూర్వ వైభవాన్ని చాటుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో హాంకాంగ్ టోర్నీపై కన్నేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ ఆంధ్రప్రదేశ్ షట్లర్ డెన్మార్క్ ప్లేయర్ లినె క్రిస్టోఫెర్సన్‌తో తలపడుతుంది.
ఆమెతో పాటు మహిళల సింగిల్స్‌లో అనుపమ, రక్షిత శ్రీలు బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత మేటి ఆటగాడు లక్ష్యసేన్ తన ఫామ్‌ను అందిపుచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ టోర్నీని సానుకూలంగా మలచుకోవాలని ఆశిస్తున్నాడు. తొలి రౌండ్లో అతను వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)ను ఎదుర్కోనున్నాడు.
యూఎస్ ఓపెన్ చాంపియన్ ఆయుశ్ షెట్టి... లూ గ్వాంగ్ జు (చైనా)తో, ప్రణయ్... ఐదో సీడ్ కొడాయ్ నరొకా (జపాన్)తో పోటీపడనున్నారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్, తరుణ్ మన్నేపల్లి క్వాలిఫయర్స్‌లో తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో హరిహరన్–రూబన్ కుమార్, మహిళల డబుల్స్‌లో రుతపర్ణ–శ్వేతపర్ణ జోడీలు బరిలోకి దిగుతున్నాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన గద్దె రుతి్వక శివాని... రోహన్ కపూర్‌తో జోడీ కట్టింది.