
విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్ కారణంగా టీమిండియా సెలక్టర్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. టెస్టు జట్టులో ఈ దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేసే సరైన ప్లేయర్ కోసం సెలక్షన్ కమిటీ వేట కొనసాగిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో ఎవరిని ఆడించాలన్నది తలనొప్పిగా మారింది.
టీమిండియాలో అతడికి చోటు కష్టమే
అయితే, వసీం జాఫర్, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు కోహ్లి స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను పంపాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్‌ల పేర్లు తెరమీదకు తీసుకువస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీసీసీఐ అధికారి ఒకరు ‘టెలిగ్రాఫ్’తో మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఒకవేళ టీమిండియా సొంతగడ్డ మీద టెస్టు సిరీస్ ఆడుతున్నట్లయితే శ్రేయస్ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉండేవి. అయితే, తదుపరి భారత జట్టు విదేశంలో సిరీస్ ఆడబోతోంది.. అది కూడా ఇంగ్లండ్ గడ్డమీద.
కాబట్టి శ్రేయస్‌కు ఛాన్స్ లేదనే చెప్పాలి. అతడు రెడ్ బాల్ క్రికెట్‌లో మరింత గొప్పగా రాణించాల్సిన అవసరం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రేయస్ అద్భుతంగా ఆడుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
కానీ టెస్టు ఫార్మాట్ వైట్‌బాల్ క్రికెట్‌తో పోలిస్తే పూర్తి భిన్నమైనది. అందుకే అతడి విషయంలో ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేము’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.
ఓపికగా బ్యాటింగ్ చేయాలి
అదే విధంగా.. ఇంగ్లండ్‌లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. కాబట్టి ఒక్కోసారి అలాంటి బంతులను వదిలేయడమే ఉత్తమం. ఇంగ్లండ్ గడ్డ మీద ఎంత ఓపికగా బ్యాటింగ్ చేస్తున్నామనదే ముఖ్యం’’ అని పేర్కొన్నారు.
కాగా శ్రేయస్ అయ్యర్ చివరగా గతేడాది ఫిబ్రవరిలో టీమిండియా తరఫున టెస్టు బరిలో దిగాడు. విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. ఆ తర్వాత అతడికి మళ్లీ ఇంత వరకు సెలక్టర్లు టెస్టు జట్టులో చోటివ్వలేదు.
చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు
అయితే, దేశవాళీ క్రికెట్‌లో శ్రేయస్ అయ్యర్ ముంబై తరఫున బరిలోకి దిగి దంచికొట్టాడు. రంజీల్లో రాణించడంతో పాటు టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ సొంతం చేసుకోవడంలో అతడిది ముఖ్య భూమిక.
ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గానూ శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. అయితే, టెస్టుల్లో మాత్రం అతడు ఇప్పట్లో పునరాగమనం చేసే అవకాశం కనిపించడం లేదు.
కాగా జూన్ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్ ఈ సిరీస్‌తోనే మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: ఓపెనర్‌గా కేఎల్ రాహుల్.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు!