‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’ | He Wil Go And return to Pavilion immediately: R Ashwin on India Star | Sakshi
Sakshi News home page

‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’

Jun 9 2026 1:05 PM | Updated on Jun 9 2026 1:23 PM

He Wil Go And return to Pavilion immediately: R Ashwin on India Star

స్వదేశంలో టీమిండియా అదరగొట్టింది. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఇన్నింగ్స్‌ మీద 300 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ముల్లన్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (126), ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (100) శతక్కొట్టిన సంగతి తెలిసిందే. 

మిగిలిన వారిలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (81), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (81) అర్ద శతకాలతో మెరిశారు. కాగా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) గతేడాది కాలంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. 

గతేడాది ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 800కు పైగా పరుగులు సాధించాడు. ఇక అఫ్గన్‌తో మ్యాచ్‌ సందర్భంగా 165 బంతుల్లో 100 రన్స్‌ చేసిన రాహుల్‌.. టెస్టు కెరీర్‌లో 12వ సెంచరీ నమోదు చేశాడు.

అశ్విన్‌ సంచలన వ్యాఖ్యలు
మొత్తంగా ఇప్పటికి టీమిండియా తరఫున 68 టెస్టులు ఆడిన రాహుల్‌ 4153 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సగటు 36.43. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ కేఎల్‌ రాహుల్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లో లేకుంటే ఈ కర్ణాటక బ్యాటర్‌ నుంచి ఒక్క పరుగు కూడా ఆశించలేమన్నాడు.

పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకుంటే..
తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ... ‘‘విదేశాల్లో కఠినమైన పిచ్‌ల మీద ఆడటం వల్ల అతడి బ్యాటింగ్‌ సగటు తక్కువగా ఉందని చాలా మంది కేఎల్‌ రాహుల్‌ను వెనకేసుకువస్తారు. కానీ అతడిలో నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను.

పిచ్‌ గనుక బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకుంటే.. అతడు ఒక్క పరుగు కూడా చేయడు. ఇలా బ్యాటింగ్‌కు వెళ్తాడు. అలా అవుటై పెవిలియన్‌కు చేరతాడు. ఒకవేళ అదే స్థానంలో విరాట్‌ కోహ్లి ఉంటే.. అప్పుడతడు ఫామ్‌లో లేకపోయినా కనీసం 30, 33, 43.. లేదంటే 28 పరుగులైనా చేస్తాడు.

కొడితే సెంచరీ.. లేదంటే
కానీ కేఎల్‌ రాహుల్‌ మాత్రం 0- 10 మధ్య కూడా పరుగులు రాబట్టలేడు. ఫామ్‌లో ఉన్నాడంటే సెంచరీ అయినా చేస్తాడు. అది వేరే సంగతి. ఒకవేళ ఫామ్‌లో లేడంటే మాత్రం మనం అతడి నుంచి పరుగులు ఆశించకూడదు.

కొడితే సెంచరీ.. లేదంటే ఇలా వెళ్లి అలా వచ్చేయడం.. కేఎల్‌ రాహుల్‌లో నేను ఈ రెండు మాత్రమే చూశాను. అతడు మధ్యస్థంగా ఆడటం ఎప్పుడూ చూడలేదు. అయితే, గత రెండేళ్లుగా అతడి ఆట తీరులో పరిణతి కనిపిస్తోంది. 

పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగ్గా ఆడుతున్నాడు’’ అని అశ్విన్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటికి 119 టెస్టు ఇన్నింగ్స్‌ ఆడిన 34 ఏళ్ల కేఎల్‌ రాహుల్‌ ఖాతాలో తొమ్మిది డకౌట్లు, 31 సింగిల్‌ డిజిట్‌ స్కోర్లు ఉండటం గమనార్హం.

చదవండి: పాకిస్తాన్‌ కంటే ప్రమాదకరమా? అని అడిగాను

Advertisement
 
Advertisement
Advertisement