న్యూజిలాండ్ వన్డే జట్టు తాత్కాలిక కెప్టెన్ మైకేల్ బ్రేస్‌వెల్‌పై టీమిండియా మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో భారత గడ్డపై తొలిసారి కివీస్‌కు వన్డే సిరీస్ విజయాన్ని అందించాడని కొనియాడాడు.
మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) ఫిట్‌నెస్ సమస్యల కారణంగా వన్డే సిరీస్‌కు దూరం కాగా.. టీ20 సారథి బ్రేస్‌వెల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.
ఈ క్రమంలో బ్రేస్‌వెల్ (Michael Bracewell) కెప్టెన్సీలో తొలి వన్డేలో టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. ఆఖరి రెండు మ్యాచ్‌లలో గెలిచి తొలిసారి భారత్‌లో వన్డే సిరీస్ గెలిచింది. ఇండోర్‌లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
బ్రేస్‌వెల్ ధనాధన్
ఈ మ్యాచ్‌లో డారిల్ మిచెల్ (131 బంతుల్లో 137), గ్లెన్ ఫిలిప్స్ (106) శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ బ్రేస్‌వెల్ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 18 బంతుల్లోనే ఓ ఫోర్, మూడు సిక్సర్లు బాది 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసిన కివీస్.. లక్ష్యాన్ని కాపాడుకుని జయభేరి మోగించింది.
ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఐదో స్థానంలో వచ్చి గ్లెన్ ఫిలిప్స్ మరోసారి అద్భుతంగా ఆడాడు. షార్ట్ పిచ్ డెలివరీలను చక్కగా ఆడాడు. బంతిని నేరుగా బౌండరీ మీదుగా తరలించాడు.
అత్యంత కీలకం
వికెట్ బాగుంది. దానిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, మైకేల్ బ్రేస్‌వెల్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఈ మ్యాచ్‌కు అత్యంత కీలకం. అతడి కారణంగానే న్యూజిలాండ్ స్కోరు 300- 330 వరకు చేరుకోగలిగింది. బ్రేస్‌వెల్ సూపర్‌గా సిక్సర్లు బాదాడు.
ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కూడా అతడిని ఎందుకు కొనలేదో నాకు ఇంత వరకు అర్థం కాలేదు. గాయం కారణంగా అతడు పెద్దగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అంతే తప్ప బ్యాటింగ్‌లో పర్లేదు. మరెందుకనో ఐపీఎల్ జట్లు అతడి వైపు మొగ్గు చూపలేదు.
అసలు ఏ ప్రాతిపదికన ఐపీఎల్ జట్లు ఆటగాళ్లను ఎంచుకుంటున్నాయో అర్థం కావడం లేదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో తొలి వన్డేలో 16 పరుగులు చేసిన బ్రేస్‌వెల్.. రెండో వన్డేలో బ్యాటింగ్ చేయకపోయినా వికెట్ తీయగలిగాడు.
తాజాగా మూడో వన్డేలో విలువైన 28 పరుగులు చేయడంతో పాటు తన అద్భుత కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. కాగా 34 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్ అయిన బ్రేస్‌వెల్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా! ఐపీఎల్ వేలం-2026లో రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన బ్రేస్‌వెల్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.
చదవండి: వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్!


