ఇంగ్లండ్‌ను గెలిపించిన హ్యారీ కేన్‌ | Harry Kane leads England to victory | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ను గెలిపించిన హ్యారీ కేన్‌

Jul 2 2026 4:01 AM | Updated on Jul 2 2026 4:01 AM

Harry Kane leads England to victory

రెండు గోల్స్‌తో మెరిసిన కెప్టెన్‌ 

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాజీ విజేత  

అట్లాంటా: ఆరు దశాబ్దాల తర్వాత ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు అద్భుతం చేసింది. ప్రపంచకప్‌ టోర్నీలోని ఓ మ్యాచ్‌లో ఆరంభంలో వెనుకబడి ఆ తర్వాత విజయాన్ని అందుకుంది. కాంగో జట్టుతో బుధవారం జరిగిన రౌండ్‌–32 నాకౌట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2–1 గోల్స్‌ తేడాతో గెలిచింది. కెప్టెన్‌ హ్యారీ కేన్‌ 11 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి ఇంగ్లండ్‌ జట్టును గెలిపించాడు. అంతకుముందు ఏడో నిమిషంలో బ్రియాన్‌ సిపెంగా గోల్‌తో కాంగో జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రక్షణాత్మక ఆటతీరుతో ఇంగ్లండ్‌ జట్టును నిలువరించి గెలుపొందాలని ప్రయత్నించింది.

కానీ ఇంగ్లండ్‌ జట్టు అవకాశం దొరికినపుడల్లా స్కోరును సమం చేసేందుకు యత్నించింది. చివరకు 75వ నిమిషంలో సఫలమైంది. ఆంథోని గోర్డాన్‌ పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న హ్యారీ కేన్‌ హెడర్‌ షాట్‌తో గోల్‌గా మలిచాడు. దాంతో ఇంగ్లండ్‌ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం 86వ నిమిషంలో గోర్డాన్‌ అందించిన పాస్‌ను హ్యారీ కేన్‌ లక్ష్యానికి చేర్చడంతో ఇంగ్లండ్‌ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత మిగిలిన సమయంలో కాంగో జట్టును నిలువరించి ఇంగ్లండ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చివరిసారి ఇంగ్లండ్‌ జట్టు 1966 ప్రపంచకప్‌ ఫైనల్లో జర్మనీపై 0–1తో వెనుకబడి విజయం సాధించింది.  

ఎంబాపె జోరు... ఫ్రాన్స్‌ గెలుపు 
న్యూయార్క్‌లో జరిగిన మరో రౌండ్‌–32 నాకౌట్‌ మ్యాచ్‌లో గత ప్రపంచకప్‌ రన్నరప్‌ ఫ్రాన్స్‌ జట్టు 3–0 గోల్స్‌ తేడాతో స్వీడన్‌ జట్టును ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రాన్స్‌ కెప్టెన్‌ కిలియాన్‌ ఎంబాపె (45వ, 74వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో మెరిపించగా... బ్రాడ్లీ బార్కోలా (53వ నిమిషంలో) మరో గోల్‌ అందించాడు. ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా మెస్సీ (అర్జెంటీనా; 19 గోల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు ఎంబాపె (18 గోల్స్‌) ఒక గోల్‌ దూరంలో ఉన్నాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పరాగ్వేతో ఇంగ్లండ్‌ తలపడుతుంది. 

మెక్సికో... 40 ఏళ్ల తర్వాత 
ఆతిథ్య మెక్సికో జట్టు 40 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో విజయం రుచి చూసింది. మెక్సికో సిటీలో జరిగిన రౌండ్‌–32 నాకౌట్‌ మ్యాచ్‌లో మెక్సికో 2–0 గోల్స్‌ తేడాతో ఈక్వెడార్‌ జట్టును ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మెక్సికో తరఫున జూలియన్‌ క్వినోనెస్‌ (22వ నిమిషంలో), రౌల్‌ జిమెనెజ్‌ (31వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 1986 ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బల్గేరియాపై గెలిచిన తర్వాత మెక్సికో జట్టు ఈ మెగా ఈవెంట్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో మళ్లీ గెలవలేదు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ జట్టుతో మెక్సికో ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement