పాక్‌పై రికార్డు విజయం.. ఆసీస్‌ దిగ్గజాన్ని అధిగమించిన టీమిండియా కెప్టెన్‌ | Harmanpreet overtakes Lanning in elite ODI milestone after routing PAK in Women's WC | Sakshi
Sakshi News home page

పాక్‌పై రికార్డు విజయం.. ఆసీస్‌ దిగ్గజాన్ని అధిగమించిన టీమిండియా కెప్టెన్‌

Oct 6 2025 4:54 PM | Updated on Oct 6 2025 5:29 PM

Harmanpreet overtakes Lanning in elite ODI milestone after routing PAK in Women's WC

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (అక్టోబర్‌ 5) జరిగిన మ్యాచ్‌లో (India vs Pakistan) టీమిండియా 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి ఓ మోస్తరు స్కోర్‌కే (247) పరిమితమైనప్పటికీ.. ఆతర్వాత ఆ స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకుంది. 

క్రాంతి గౌడ్‌ (10-3-20-3) అద్భుతమైన బౌలింగ్‌తో పాక్‌ పతనాన్ని శాశించింది. క్రాంతితో పాటు దీప్తి శర్మ (9-0-45-3), స్నేహ్‌ రాణా (8-0-38-2) కూడా సత్తా చాటడంతో పాక్‌ 43 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ తరఫున సిద్రా అమీన్‌ (81) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. 

అంతకుముందు భారత ఇన్నింగ్స్ డయానా బేగ్‌ (10-1-69-4) ధాటికి తడబడింది. టాపార్డర్‌ మొత్తానికి మంచి ఆరంభాలు లభించినా, ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు. ఆఖర్లో రిచా ఘోష్‌ (20 బంతుల్లో 35 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించింది.

ఈ గెలుపుతో భారత్‌ వన్డే ఫార్మాట్‌లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్‌కప్‌ టోర్నీల్లోనూ పాక్‌పై ఆధిపత్యాన్ని (5-0) కొనసాగించింది. 

పహల్గాం​ ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్‌ జట్లు పాక్‌ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించాయి. దీనికి ముందు భారత పురుషుల జట్టు ఆసియా కప్‌లో పాక్‌ను వరుసగా మూడు ఆదివారాల్లో ఓడించి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.

ఇదిలా ఉంటే, నిన్నటి గెలుపుతో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (Harmanpreet kaur) ఓ అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ఆమె ప్లేయర్‌గా 90వ విజయాన్ని నమోదు చేసి, మహిళల వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకింది. 

ఈ క్రమంలో ఆసీస్‌ దిగ్గజ ప్లేయర్‌, ఆ జట్టు మాజీ కెప్టెన్‌, రెండు సార్లు వన్డే ప్రపంచకప్‌ విన్నర్‌ మెగ్‌ లాన్నింగ్‌ను (Meg Lanning) అధిగమించింది. లాన్నింగ్‌ తన కెరీర్‌లో ప్లేయర్‌గా 89 విజయాలు సాధించగా.. హర్మన్‌ నిన్నటి మ్యాచ్‌తో ఆమెను దాటేసింది. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అగ్రస్థానంలో ఉంది. మిథాలీ తన వన్డే కెరీర్‌లో 129 విజయాలు సాధించింది.

మహిళల వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్లు
మిథాలీ రాజ్‌- 129
ఎల్లిస్‌ పెర్రీ- 125
అలైస్సా హీలీ- 103
బెలిండ క్లార్క్‌- 94
కేట్‌ సీవర్‌ బ్రంట్‌- 93
కేట్‌ ఫిజ్‌ప్యాట్రిక్‌- 91
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌- 90
మెగ్‌ లాన్నింగ్‌- 89 

 చదవండి: లంక ప్రీమియర్‌ లీగ్‌లో భారత ఆటగాళ్లు.. చరిత్రలో తొలిసారి..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement