‘నాయకురాలి’ నిష్క్రమణ | Harmanpreet Kaur bids farewell to captaincy | Sakshi
Sakshi News home page

‘నాయకురాలి’ నిష్క్రమణ

Oct 7 2026 4:00 AM | Updated on Oct 7 2026 4:00 AM

Harmanpreet Kaur bids farewell to captaincy

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌  

వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన ఘనత 

కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన

ముంబై: భారత మహిళల క్రికెట్‌ జట్టుకు సంబంధించి కీలక మార్పు చోటు చేసుకుంది. మూడు ఫార్మాట్‌లలో జట్టు కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. భారత మహిళల క్రికెట్‌ జట్టు భవిష్యత్తు కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసే క్రమంలో హర్మన్, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన, హెడ్‌ కోచ్‌ అమోల్‌ మజుందార్‌లతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా సమావేశమయ్యారు. ఇందులోనే హర్మన్‌ కెప్టెన్సీ విషయంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇది ముగిసిన తర్వాతే 37 ఏళ్ల హర్మన్‌ తాను నాయకత్వానికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. 

నిజానికి గత జూన్‌లో టి20 ప్రపంచ కప్‌లో భారత్‌ సెమీస్‌కు చేరడంలో విఫలం కావడంతోనే ఆమెపై విమర్శలు రావడంతో పాటు తప్పుకునే సమయం ఆసన్నమైందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరో వైపు టీమ్‌ నంబర్‌వన్‌ బ్యాటర్, 30 ఏళ్ల స్మృతి మంధాన రెగ్యులర్‌ కెప్టెన్సీ కోసం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తోంది. డబ్ల్యూపీఎల్‌లో రెండు సార్లు బెంగళూరును విజేతగా నిలపడంతో ఆమె కెప్టెన్సీకి ప్రశంసలు కూడా లభించాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో సారథ్యం వదులుకున్న హర్మన్‌...బ్యాటర్‌గా కొనసాగుతానని ప్రకటించింది.

‘ఇది చాలా కఠిన నిర్ణయం. జీవితకాలం గుర్తుంచుకోదగ్గ జ్ఞాపకాలు, క్షణాలు నా కెప్టెన్సీలో ఉన్నాయి. ఈ జట్టు కోసం నేను అన్నీ ఇచ్చాను. వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టుకే ప్రాధాన్యతనిచ్చా. కెప్టెన్‌గా తీసుకున్న పలు కఠిన నిర్ణయాలను అందరూ అర్థం చేసుకున్నారు. గొప్ప ఘనతలతో పాటు వైఫల్యాలు, గుండెకోతలు, విమర్శలు కూడా ఎదురయ్యాయి. భావోద్వేగాలతో పాటు ప్రశాంతంగా తప్పుకుంటున్నా. నాయకురాలిగా నా బాధ్యత ముగిసింది. ఇకపై ఆటపై ప్రేమతో కేవలం బ్యాటర్‌గా  కొత్త అధ్యాయాన్ని మొదలు పెడతా’ అని హర్మన్‌ పేర్కొంది. హర్మన్‌ స్థానంలో స్మృతిని కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

కెప్టెన్‌గా శిఖరాన... 
బ్యాటర్‌గా తన తొలి నాలుగు వన్డే వరల్డ్‌ కప్‌లు ఆడిన హర్మన్‌... 2025లో తొలిసారి సారథిగా జట్టును నడిపించింది. మొదటిసారే టీమ్‌ను విశ్వ విజేతగా నిలిపి తన పేరును చరిత్రలో లిఖించుకుంది. సుదీర్ఘ కాలంగా గుర్తింపు కోసం పోరాడిన మహిళల టీమ్‌కు తొలి వరల్డ్‌ కప్‌ అందించడం ఆమె కెరీర్‌లో అత్యుత్తమ క్షణం. అయితే టి20 ఫార్మాట్‌లో మాత్రం అదృష్టం కలిసి రాలేదు. 

హర్మన్‌ కెప్టెన్సీలో 3 టి20 ఆసియా కప్‌లు, 2 సార్లు ఆసియా క్రీడల స్వర్ణాలు జట్టు గెలిచింది. కానీ 4 టి20 వరల్డ్‌కప్‌లలో సారథ్యం వహించగా...ఒక సారి, మరో సారి సెమీస్‌ చేరిన జట్టు మరో రెండు సార్లు లీగ్‌ దశకే పరిమితమైంది. హర్మన్‌ కెప్టెన్సీలో 155 టి20లు ఆడిన జట్టు 92 మ్యాచ్‌లలో గెలిచి 57 మ్యాచ్‌లలో ఓడింది. 51 వన్డేల్లో 30 విజయాలు, 19 పరాజయాలు దక్కగా...5 టెస్టుల్లో 4 గెలిచి 1 మ్యాచ్‌లో ఓడింది.

స్వదేశంలో జింబాబ్వేతో జరిగే వన్డే, టి20 సిరీస్‌ల కోసం సెలక్టర్లు జట్లను ప్రకటించారు. టి20లకు షఫాలీ వర్మ, వన్డేలకు దీప్తి శర్మ వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. జెమీమా రోడ్రిగ్స్‌ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఎంపిక చేయలేదు. ప్రతీక రావల్‌ టి20 టీమ్‌లో స్థానం కోల్పోగా...నికీ ప్రసాద్, మిన్ను మణి, అనుష్క శర్మ, జింతిమణి కలితలకు స్థానం దక్కగా...వన్డే టీమ్‌లో వైష్ణవి శర్మ, తేజల్‌ హస్నబిస్, సయాలీ సత్గరేలను ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement