
ధోని- కైఫ్ (PC: BCCI)
టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సొంతం. 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్-2011 (ODI World Cup), ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2013లను ధోని సారథ్యంలో భారత్ గెలుచుకుంది. తద్వారా దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని ఇప్పటికీ కొనసాగుతున్నాడు.
జట్టులోనే ఉండడు.. ఖేల్ ఖతం అనుకున్నాం..
అయితే, అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలోనే డకౌట్ అయిన ధోని.. జట్టులో కొనసాగడం కష్టమేనని అప్పటికి జట్టులో ఉన్న క్రికెటర్లు భావించారట. అతడి ఆట మూణ్ణాళ్ల ముచ్చటేనని.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించలేడని అనుకున్నారట. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) ఈ విషయాన్ని వెల్లడించాడు.
కాగా ధోని సోమవారం (జూలై 7) 44వ వసంతంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ధోని గురించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కైఫ్.. అరంగేట్ర వన్డే సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచిన ధోని.. 2005లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన తీరు తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.
వన్‌డౌన్‌లో రావడమే సర్ప్రైజ్
‘‘పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడి ఎంతగా ఉంటుందో తెలుసు కదా!.. నాటి ఆ మ్యాచ్‌లో ధోనిని టాపార్డర్‌కు ప్రమోట్ చేయాలని గంగూలీ భావించాడు. అతడు కొన్నైనా పరుగులు చేస్తాడని అనుకున్నాడు.
కానీ అతడు 140 పరుగులు చేస్తాడని ఎవరు అనుకోగలరు. డ్రెసింగ్‌రూమ్‌లో ఈ విషయం గురించి ఒక్కరికీ తెలియదు. కనీసం ఎవరూ ఊహించను కూడా లేదు. అసలు అతడు వన్‌డౌన్ (మూడో స్థానం)లో బ్యాటింగ్‌కు వెళ్లడమే ఒక సర్‌ప్రైజ్.
అలాంటిది అతడు పాయింట్, మిడాఫ్ మీదుగా అలా షాట్లు బాదుతుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. అసలు ఇతడు ఇలాంటి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడతాడని ఒక్కరమూ ఊహించలేదు. మా ఆలోచన ఎంత తప్పో తన ఆట ద్వారానే నిరూపించాడు.
అందరి బౌలింగ్‌ను చితక్కొట్టాడు
ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ అతడు షాట్లు బాదుతూనే ఉన్నాడు. పవర్ ప్లేలో మొదలుపెడితే.. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు అన్న తేడా లేకుండా అందరి బౌలింగ్‌ను చితక్కొట్టాడు. తనకు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అని అతడికి తెలుసు.
ఒకవేళ మూడో స్థానంలో గనుక తను రాణించకపోతే.. భవిష్యత్తులో తనకు మళ్లీ అవకాశాలు రావని కూడా అతడికి తెలుసు. అందుకే అతడు ధైర్యంగా, దూకుడుగా ఆడి సత్తా చాటాడు’’ అని మహ్మద్ కైఫ్ జియోస్టార్ షోలో పేర్కొన్నాడు.
కాగా 2005లో పాక్‌తో రెండో వన్డేలో ధోని 123 బంతుల్లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 148 పరుగులు చేశాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్ వల్ల టీమిండియా పాక్‌ను ఓడించింది. అయితే, స్వదేశంలో జరిగిన ఆ సిరీస్‌లో మాత్రం 4-2తో ఓటమిపాలైంది.
దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్
కాగా 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లోనూ అరంగేట్రం చేసిన ధోని.. 2006లో టీ20లలో ప్రవేశించాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే నాయకుడిగా ఎదిగిన ధోని.. 2007లో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు.
భారత దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎదిగాడు ధోని. టీమిండియా తరఫున మొత్తంగా 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టులు ఆడిన తలా... ఆయా ఫార్మాట్లలో 10773, 1617, 4876 పరుగులు సాధించాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో కెప్టెన్‌గా.. చెన్నై సూపర్ కింగ్స్‌ను రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు తలా.
చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్