
నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
అహ్మదాబాద్: ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ చేరుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టు... ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై దృష్టి పెట్టింది. ఐపీఎల్ 18వ సీజన్‌లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 3 పరాజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకొని ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ దక్కించుకున్న మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ నేడు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)తో తలపడనుంది. 2022, 2023లలో ఫైనల్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్... ఈసారి కూడా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ఫైనల్‌కు చేరేందుకు అదనంగా మరో అవకాశం ఉండటంతో... ప్రస్తుతానికి టైటాన్స్ దానిపైనే దృష్టి పెట్టింది.
మరోవైపు ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్ చివర్లో అయినా మెరిపించాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో టైటాన్స్ ఓడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి లక్నో చేతిలో ఉండటంతో దానికి సొంతగడ్డపై బదులు తీర్చుకోవాలని కూడా చూస్తోంది. గుజరాత్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీదుంటే... లక్నో జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. మరి టైటాన్స్ అదే ఊపుతో మరింత ముందుకు దూసుకెళ్తుందా లేక... లక్నో పరాజయాల బాట వీడుతుందా చూడాలి!
ముగ్గురు మొనగాళ్లు...
ఈ సీజన్‌లో టైటాన్స్ ఆధిపత్యానికి ప్రధాన కారణం... టాప్–3 ఆటగాళ్లే. కెపె్టన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్, ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ కలిసికట్టుగా కదంతొక్కడంతోనే గుజరాత్ జట్టు వరుస విజయాలు సాధించగలిగింది. సాయి సుదర్శన్ 56.09 సగటుతో 617 పరుగులు చేయగా... గిల్ 60.10 సగటుతో 601 పరుగులు సాధించాడు. బట్లర్ 500 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు జట్టు భారాన్ని మోస్తూ మెరుగైన ఆరంభాలు అందిస్తుండటంతో... టైటాన్స్ భారీ స్కోర్లు చేయగలుగుతోంది.
ఈ త్రయం 16 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేసిందంటే వీరి ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ ముగ్గురితో పాటు రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా రూపంలో మిడిలార్డర్ బలంగా ఉండగా... బౌలింగ్‌లో కూడా మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాదీ పేసర్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రబడ, రషీద్ ఖాన్, సాయి కిషోర్ రూపంలో బౌలింగ్ దళం మెరుగ్గా ఉంది. అయితే గుజరాత్ బలం, బలహీనత రెండు టాపార్డరే కావడం గమనార్హం.
టాప్–3 ఆటగాళ్లు విఫలమైతే మిడిలార్డర్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడేవాళ్లు కనిపించడం లేదు. లక్నోతో లీగ్ మ్యాచ్‌లో ఇది నిరూపితమైంది. 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసిన టైటాన్స్... గిల్, సుదర్శన్, బట్లర్ అవుటైన తర్వాత 180/6కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కీలక ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు ముందు మిడిలార్డర్‌ను పరీక్షించుకోవాల్సిన అవసరముంది. సీజన్‌లో అన్నీ మ్యాచ్‌లు ఆడిన ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశాలు కూడా ఫ్రాంఛైజీ పరిశీలిస్తోంది.
తీవ్ర ఒత్తిడిలో పంత్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రిషభ్ పంత్... సీజన్ చివరికి వచ్చేసరికి తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. అంచనాల భారాన్ని మోయలేకపోతున్న పంత్... అటు బ్యాటర్‌గా, ఇటు కెపె్టన్‌గా విఫలమవుతున్నాడు. మిచెల్ మార్‡్ష, మార్క్‌రమ్, నికోలస్ పూరన్ రూపంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... జట్టు విజయాలు సాధించలేకపోవడానికి పంత్ ప్రదర్శనే ప్రధాన కారణం. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసుకున్నా... పంత్ ఆటతీరు మాత్రం మారడం లేదు.
పట్టుమని పది నిమిషాలు కూడా క్రీజులో నిలవకుండానే పేలవ షాట్ ఆడి పెవిలియన్ చేరడం పరిపాటిగా మారింది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన పంత్ 12.27 సగటుతో 135 పరుగులే చేశాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమితోనే ‘ప్లే ఆఫ్స్’చేరే అవకాశాలు కోల్పోయిన ఎల్‌ఎస్‌జీ... ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి మెరుగైన స్థానంతో సీజన్‌ను ముగించాలని భావిస్తోంది.
ఆయుశ్ బదోని, అబ్దుల్ సమద్ నిలకడలేమితో ఇబ్బంది పడుతుంటే... బౌలర్లను గాయాల బెడద వెంటాడుతోంది. ప్రధాన పేసర్లు గాయాల బారిన పడటంతో ప్రత్యామ్నాయాలు లేక మేనేజ్‌మెంట్ చిక్కులు ఎదుర్కొంటోంది. మయాంక్ యాదవ్ అందుబాటులో లేకపోగా... అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు గత మ్యాచ్‌లో హద్దులు దాటినందుకు స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీపై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు.
తుది జట్లు(అంచనా)
గుజరాత్ టైటాన్స్: గిల్ (కెప్టెన్ ), సాయి సుదర్శన్, బట్లర్, రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రబడ, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్ ), మార్ష్ , మార్క్‌రమ్, పూరన్, బదోని, అబ్దుల్ సమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆకాశ్‌దీప్, అవేశ్ ఖాన్, షాబాజ్ నదీమ్, రూర్కె.