
ఆలోచనల్లో స్పష్టత అవసరం
కోర్ గ్రూప్ సిద్ధం చేసుకోవాలి
భారత సారథికి గ్రెగ్ చాపెల్ సూచన
న్యూఢిల్లీ: సారథి అంటే కేవలం మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేయడం... బౌలర్లను మార్చడం మాత్రమే కాదని నాయకుడిగా జట్టులో స్ఫూర్తి నింపాలని ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ అన్నాడు. ఇంగ్లండ్‌తో ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీలో భాగంగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు 1–2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్ ద్వారానే భారత జట్టు పగ్గాలు అందుకున్న 25 ఏళ్ల శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి చాపెల్ ఓ వ్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. గిల్‌కు అసలు పరీక్ష ఇక ముందే ఎదురవనుందన్న చాపెల్... అతడు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని అన్నాడు.
నాయకుడంటే సహచరుల్లో నమ్మకం నింపే వాడని... జట్టు సమావేశాల్లో తనకు ఏం కావాలో అది స్పష్టంగా వెల్లడించగలిగినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నాడు. ఈ సిరీస్‌లో బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్న గిల్... మున్ముందు సారథిగాను విజయవంతమవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో చాలా సందర్భాల్లో పైచేయి కనబర్చే విధంగా కనిపించిన టీమిండియా... చివరకు పరాజయం పాలవగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆడటంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
పనిభారం కారణంగా ఈ సిరీస్‌లో బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఇదివరకే స్పష్టం చేయగా... ఇప్పటి వరకు అతడు రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. మరి సిరీస్ సమం చేయాల్సిన అవసరమున్న ఈ కీలక పోరులో అతడు ఆడతాడా లేడా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెపె్టన్... గిల్‌కు పలు సూచనలు చేశాడు. అవి అతడి మాటల్లోనే...
‘ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా సిరీస్ గెలవాలంటే ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గాలి. ఇలాంటి సమయంలో శుబ్‌మన్ గిల్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు అతడు బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. కెపె్టన్‌గానూ కొన్ని సందర్భాల్లో ఫర్వాలేదనిపించాడు. అయితే ఇలాంటి ఎన్నో కఠిన క్షణాలు ఎదుర్కొన్నప్పుడే సారథిలోని సామర్థ్యం బయటపడుతుంది. జట్టును ఎలా తీర్చిదిద్దాలకుంటున్నాం అనే స్పష్టత కెప్టెన్‌కు ఉండాలి. అది కేవలం తన మాటల ద్వారానే కాకుండా తన చర్యల ద్వారా ప్రస్ఫుటించాలి. ఫీల్డ్‌లో మరింత కఠినంగా ఉండాలి.
లార్డ్స్ టెస్టులో ప్రత్యర్థులు సమయాన్ని వృథా చేస్తున్న సమయంలో గిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథిగా అది అతడి బాధ్యత. మున్ముందు కూడా దీన్ని కొనసాగిస్తాడా చూడాలి. ఈ సిరీస్‌ను పరిశీలించుకుంటే భారత జట్టు ప్రత్యరి్థకి సులువుగా పరుగులు చేసే అవకాశం ఇచ్చింది. దీంతో పాటు కొన్ని సులువైన క్యాచ్‌లు సైతం నేలపాలు చేసింది. అలాంటివి తగ్గించుకోవాల్సిన అవసరముంది. స్లిప్ ఫీల్డింగ్ మరింత మెరుగవ్వాలి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి. కోర్ గ్రూప్‌ను సిద్ధం చేసుకోవాలి. జట్టులోని ప్రతి ఆటగాడికి వారి బాధ్యతలు వివరించాలి. అప్పుడే ప్లేయర్లకు తమ కర్తవ్యం బోధపడుతుంది.
ఫామ్ లేమితో తంటాలు పడుతున్న ఆటగాళ్లకు కోలుకునే అవకాశం ఇచ్చేందుకు జాతీయ జట్టు సరైన స్థానం కాదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా ఆటగాళ్లపై విశ్వాసం ఉంచి వారిలో నమ్మకం పెంచాల్సిన బాధ్యత సారథిదే. ఇప్పుడు భారత జట్టు అలాంటి పరిస్థితిలోనే ఉంది. సిరీస్‌లో వెనుకబడి ఉన్న దశలో అతడు జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. తనదైన ముద్ర వేసేందుకు ఇదే సరైన సమయం. మంచి జట్టును ఎంపిక చేసుకోవాలి.
క్రికెట్ జట్టు క్రీడ. ఇందులో ఒక్కరిద్దరు మెరుగైన ప్రదర్శన చేస్తే సరిపోదు. సమష్టిగా సత్తాచాటాలి. భాగస్వామ్యాలతోనే భారీ స్కోర్లు సాధ్యమవుతాయి. ఒక్క ప్లేయర్ ఎప్పుడూ మ్యాచ్‌ను గెలిపించలేడు. మంచి స్పెల్‌లు, మంచి సెషన్‌లతోనే మ్యాచ్ ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఆలోచనలు స్పష్టంగా ఉండాలి. అప్పుడే ఈ సిరీస్‌తో పాటు భవిష్యత్తులోనూ అతడు జట్టును మెరుగైన దిశలో నడిపించగలడు’