ఒకే జట్టులో అర్జున్, గుకేశ్‌ ,హంపి, హారిక | Global Chess League Player Drafting Completed | Sakshi
Sakshi News home page

ఒకే జట్టులో అర్జున్, గుకేశ్‌ ,హంపి, హారిక

Sep 27 2025 1:47 AM | Updated on Sep 27 2025 1:47 AM

Global Chess League Player Drafting Completed

భారత గ్రాండ్‌మాస్టర్లను దక్కించుకున్న పీబీజీ అలాస్కాన్‌ నైట్స్, ముంబా మాస్టర్స్‌

ముగిసిన గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ ప్లేయర్ల డ్రాఫ్టింగ్‌

డిసెంబర్‌ 13 నుంచి 21 వరకు ముంబైలో ఈవెంట్‌

ముంబై: ప్రపంచ చదరంగంలోని మేటి ప్లేయర్లు ఒకే వేదికపై వచ్చి ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు సిద్ధమయ్యారు. టెక్‌ మహీంద్ర, అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) సంయుక్త ఆధ్వర్యంలో జరుగనున్న గ్లోబల్‌ చెస్‌ లీగ్‌  (జీసీఎల్‌) మూడో సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌ పూర్తయింది. భారత్‌ నుంచి తొమ్మిది మంది గ్రాండ్‌మాస్టర్లు ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. క్లాసికల్‌ ఫార్మాట్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకర్‌ దొమ్మరాజు గుకేశ్‌... ప్రపంచ ఐదో ర్యాంకర్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. 

గుకేశ్, అర్జున్‌లను పీబీజీ అలాస్కాన్‌ నైట్స్‌ జట్టు సొంతం చేసుకుంది. భారత స్టార్‌ మహిళా గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక కూడా ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రపంచ మహిళల ర్యాపిడ్‌ ఫార్మాట్‌ చాంపియన్, ప్రపంచ ఐదో ర్యాంకర్‌ కోనేరు హంపి, ప్రపంచ 19వ ర్యాంకర్, హైదరాబాద్‌కు చెందిన హారికను అప్‌గ్రాడ్‌ ముంబా మాస్టర్స్‌ జట్టు దక్కించుకుంది. డిసెంబర్‌ 13 నుంచి 24వ తేదీ వరకు జరిగే ఈ మెగా లీగ్‌కు ముంబై ఆతిథ్యమిస్తుంది. 

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ గ్యాంజస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ జట్టు తరఫున కొనసాగుతుండగా... భారత నంబర్‌వన్‌ ప్రజ్ఞానంద అల్పైన్‌ ఎస్‌జీ పైపర్స్‌ జట్టుకు ఆడనున్నాడు. మొత్తం ఆరు జట్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో టోర్నీ జరుగుతుంది. గేమ్‌లను ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. ఒక్కో జట్టులో ఆరుగురు ప్లేయర్లు ఉండగా... అందులో ఇద్దరు మహిళా క్రీడాకారిణులున్నారు.  

గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ మూడో సీజన్‌ జట్ల వివరాలు 
అమెరికన్‌ గాంబిట్స్‌: హికారు నకముర (అమెరికా), రిచర్డ్‌ రాపోర్ట్‌ (హంగేరి), వ్లాదిస్లావ్‌ అర్తెమియెవ్‌ (రష్యా), బీబీసారా అసయుబయేవా (కజకిస్తాన్‌), టియోడోరా ఇంజాక్‌ (సెర్బియా), వొలోడార్‌ ముర్జిన్‌ (రష్యా). 

అల్పైన్‌ ఎస్‌జీ పైపర్స్‌: ఫాబియానో కరువానా (అమెరికా), ప్రజ్ఞానంద (భారత్‌), అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌), హు ఇఫాన్‌ (చైనా), నినో బత్సియాష్‌విలి (జార్జియా), లియోన్‌ మెన్‌డోంకా (భారత్‌). 

గ్యాంజస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌: విశ్వనాథన్‌ ఆనంద్‌ (భారత్‌), జవోఖిర్‌ సిందరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌), విన్సెంట్‌ కీమెర్‌ (జర్మనీ), స్టవ్‌రూలా సొలాకిడూ (గ్రీస్‌), పొలీనా షువలోవా (రష్యా), రౌనక్‌ సాధ్వాని (భారత్‌). 

అప్‌గ్రాడ్‌ ముంబా మాస్టర్స్‌: మాక్సిమి వాచియెర్‌ లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌), షఖిర్యార్‌ మమెదైరోవ్‌ (అజర్‌బైజాన్‌), వెస్లీ సో (అమెరికా), కోనేరు హంపి (భారత్‌), ద్రోణవల్లి హారిక (భారత్‌), బర్దియా దానేశ్వర్‌ (ఇరాన్‌). 

పీబీజీ అలాస్కాన్‌ నైట్స్‌: దొమ్మరాజు గుకేశ్‌ (భారత్‌), ఇరిగేశి అర్జున్‌ (భారత్‌), లీనియర్‌ డొమింగెజ్‌ (అమెరికా), సారాసాదత్‌ ఖాడెమ్‌ (స్పెయిన్‌), కాటరీనా లాగ్నో (రష్యా), డేనియల్‌ దర్ధా (బెల్జియం). 

త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌: అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌), యి వె (చైనా), విదిత్‌ సంతోష్‌ గుజరాతి (భారత్‌), అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (స్విట్జర్లాండ్‌), జు జినెర్‌ (చైనా), మార్క్‌ ఆండ్రియా మౌరిజి (ఫ్రాన్స్‌). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement